చలి మొదలాయే..
సూర్యాపేట : చలి మొలైంది. మూడు రోజులుగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. వానాకాలం సీజన్ ముగియడంతో వాతా వరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా చలి తీవ్రత అధికమైంది. ఈనెల 5వ తేదీన 23 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదుకాగా.. 8వ తేదీ నాటికి ఏకంగా 6 డిగ్రీల తగ్గి 17డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న మూడురోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువై చలి తీవ్రత మరింత అధికం కానుంది.
మూడు రోజులుగా..
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ వానాకాలం సీజన్‌లో వర్షాలు కురిశాయి. జిల్లాలో దీపావళి పండుగ వచ్చిందంటే వర్షాల జాడే ఉండదు. అలాంటిది వానాకాలం సీజన్‌లో నవంబర్ మొదటి వారం వరకు భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందేమోనని అందరూ భావిస్తుండగా.. శనివారం నుంచి చలి పెడుతోంది. పగటి ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు లేకున్నా.. రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో రాత్రి సమయంలో ఫ్యాన్లు, కూలర్లు పనిచేస్తేనే నిద్రపట్టగా.. మూడురోజులుగా వాటిని బంద్ చేసే పరిస్థితి జిల్లాలో ఏర్పడింది.
సాయంత్ర 5.30 గంటలు దాటితే..
ప్రస్తుతం సాయంత్రం 5.30 గంటలు అయితే చాలు చలిగాలులు వీస్తున్నాయి. ఇక తెల్ల వారుజామున 3గంటల నుంచే చలి విపరీతంగా పెరుగుతోంది. దీనికి తోడుగా అక్కడక్కడ మంచు పడుతోంది. ప్రస్తుతం రాత్రి ఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉండగా రానున్న రెండు, మూడురోజుల్లో 15 డిగ్రీలకు చేరి చలి మరింత పెరగనుంది. ఈనెల 11వ తేదీన 16 డిగ్రీలు, 12న 16 డిగ్రీలు, 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉష్ణోగ్రతలు ఇలా
( డిగ్రీల సెంటీగ్రేడ్‌లలో )
జిల్లాలో మూడురోజులుగా
పెరిగిన చలి తీవ్రత
తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
రానున్న రోజుల్లో మరింత
పెరిగే అవకాశం
తేదీ గరిష్టం కనిష్టం
05 31 23
06 30 21
07 31 20
08 31 17
09 29 17
10 28 16


