బీసీ రిజర్వేషన్లతోనే సామాజిక తెలంగాణ
సూర్యాపేట : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన సామాజిక తెలంగాణ నిర్మాణంలో కీలక ముందడుగు అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం సూర్యాపేటలో పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సామాజిక తెలంగాణ– బీసీ రిజర్వేషన్లు– ప్రాతినిథ్యం ప్రజాస్వామ్యం’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. అనేక త్యాగాలతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ భాగస్వామ్యం కల్పించాల్సి ఉందన్నారు. బీజేపీ మొదటి నుంచీ కుల గణనకు వ్యతిరేకమని, రాష్ట్ర ప్రభుత్వం కులగణనపై ముందడుగు వేయడం హర్షణీయమన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చి న్యాయసమీక్ష నుంచి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. శాసనసభ చట్టం చేసి పంపితే తిరస్కరించే అధికారం గవర్నర్లకు లేదన్నారు. గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నారబోయిన కిరణ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్, నాయకులు కుంట్ల ధర్మార్జున్, నాగరాజుగౌడ్, నరసింహ, వీరేశ్‌నాయక్, వినయ్‌గౌడ్, నారాయణ, సుమన్‌నాయక్, మురళి పాల్గొన్నారు.


