ప్రయోగాలతో పాఠాల బోధన సులువు
సూర్యాపేట : ప్రయోగాలతోనే విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థమయ్యేలా బోధించవచ్చని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మారం పవిత్ర అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్న పాఠశాలో సైన్స్ అకాడమీ బృందం ఆధ్వర్యంలో జీవశాస్త్ర ఉపాధ్యాయులకు 7 నుంచి 10వ తరగతి వరకు పాఠాలను సులభంగా బోధించే ప్రక్రియపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి 40 మంది జీవశాస్త్ర ఉపాధ్యాయులు హాజరు కాగా వారికి పలు అవయవాల గురించి ప్రయోగాత్మకంగా వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ బయాలజికల్ సైన్స్ ఫోరం అధ్యక్షుడు ఎల్.దేవరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
డీఏలు, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
సూర్యాపేట : ప్రభుత్వం నుంచి రావాల్సిన ఐదు డీఏలు, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి డి.మోతీలాల్‌నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి భగ్గులాల్‌నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన టీజీయూఎస్ జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లడారు. ప్రభుత్వం ఉద్యోగులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి నెలా విడుదల చేయాల్సిన రూ.700 కోట్లను కూడా సరైన సమయంలో విడుదల చేయడం లేదన్నారు. దాంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర సహ అధ్యక్షుడు డి.వస్రాంనాయక్, నాయకులు రాములునాయక్, మోతీలాల్, లింగానాయక్, హనుమంత్, ఉప్పయ్య పాల్గొన్నారు.
దేశంలో పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగం
సూర్యాపేట అర్బన్ : ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం, పేదరికం, అధిక ధరలు, తీవ్ర అసమానతలు పెరిగి పోతున్నాయని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండాది డేవిడ్ కుమార్ అన్నారు. కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభను శనివారం జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం అభివృద్ధిలో దూసుకు పోతుందని ప్రధాని మోదీ ప్రచారం చేసుకుంటున్నారని, కార్పొరేట్ శక్తుల అభివృద్ధే దేశాభివృద్ధిగా చెబుతూ ప్రజల్ని ప్రక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. చండ్ర పుల్లారెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని యువత పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కునుకుంట్ల సైదులు, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలెబోయిన కిరణ్, జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నరసమ్మ, దేశోజు మధు, సామ నర్సిరెడ్డి, బొల్లె వెంకన్న పాల్గొన్నారు .
ప్రయోగాలతో పాఠాల బోధన సులువు
ప్రయోగాలతో పాఠాల బోధన సులువు


