ప్యాడీ క్లీనర్లు ఉన్నా.. ప్రయోజనం సున్నా!
సూర్యాపేట జిల్లాలో 338 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా ఇప్పటివరకు కొనుగోళ్లలో వేగం పుంజుకోలేదు. ఇక ఆయా కేంద్రాల్లో 220 వరకు ప్యాడీ క్లీనర్లు పాతవి ఉండగా అవి ఏ మాత్రం పనిచేయడం లేదు. వాటి స్థానంలో ఇటీవల 100 ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లను కొనుగోలు చేశారు. ఒక్కో ప్యాడీ క్లీనర్‌కు రూ.40,000 చొప్పున వెచ్చించారు. రెండు లిఫ్టింగ్ కం ప్యాడీ క్లీనర్లను రూ.1.92 లక్షల చొప్పున వెచ్చించి కొనుగోలు చేశారు. మరో రెండు ప్యాడీ డ్రయర్‌లను రూ.14 లక్షలతో కొనుగోలు చేశారు. ప్యాడీ క్లీనర్లు ఉన్నా చాలా చోట్ల విద్యుత్ సదుపాయం లేకపోవడంతో రైతులే సొంతంగా విద్యుత్ సరఫరాను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. కేంద్రం నిర్వాహకులు కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. చాలా గ్రామాలో కొనుగోలు కేంద్రాలు దూర ప్రాంతంలో ఉండడంతో విద్యుత్ సదుపాయం లేక ప్యాడీ క్లీనర్లు రైతులకు ఉపయోగపడడం లేదు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తూర్పార పట్టేందుకు ఏర్పాటు చేసిన ప్యాడీ క్లీనర్లు నిరుపయోగంగా మారాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో వాటిని మూలన పడేశారు. కొన్నిచోట్ల విద్యుత్ సదుపాయం లేకపోవడంతో.. మరికొన్ని చోట్ల విద్యుత్ సదుపాయం ఉన్నా నిర్వాహకులు ఇవ్వకపోవడంతో అవి రైతులుకు ఉపయోగపడడం లేదు. కొన్ని కేంద్రాల్లో నిర్వాహకులే ప్యాడీ క్లీనర్లతో పనేంటి? ఓ రెండు బస్తాలు తగ్గిస్తారు.. అంతేకదా.. అమ్ముకోండంటూ రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు. దీంతో రైతులు ఏం చేయలేని పరిస్థితిలో పడ్డారు. మీ ధాన్యం తాలు ఉదంటూ మిల్లర్లు ఒకటీ రెండు బస్తాల వరకు కోత పెడుతున్నా గత్యంతరం లేక అమ్ముకోవాల్సి వస్తోంది.
ప్రభుత్వ సొమ్ము వృథా..
కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్యాడీ క్లీనర్లు రైతులకు ఉపయోగపడడం లేదు. కొన్ని చోట్ల రైతులు ప్యాడీ క్లీనర్లకు రైతులే విద్యుత్ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకొని వినియోగించుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ సొమ్ముతో కొన్న యంత్రాలు రైతులకు ఉపయోగపడకపోగా, ప్రభుత్వ డబ్బు వృథా అవుతోంది. రైతులకు మద్దతు ధర ఇప్పిస్తున్నామని చెబుతున్న అధికారులు కొనుగోలు కేంద్రాలు, మిల్లుల్లో అడ్డగోలు కోతలను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ జిల్లాలో
మరో 107 యంత్రాలకు ఇండెంట్
ఈ వానాకాలం సీజన్‌లో నల్లగొండ జిల్లాలో 356 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన యంత్రాంగం ఇప్పటివరకు 250 కేంద్రాలను తెరిచి, కొనుగోళ్లు ప్రారంభించింది. ధాన్యంలో తాలు, మట్టి, గడ్డి వంటివి లేకుండా, ధాన్యం తూర్పారా బట్టేందుకు ప్యాడీ క్లీనర్లను వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసింది. జిల్లాలో 388 ప్యాడీక్లీనర్లు ఇప్పటికే ఉన్నాయి. ఇంకా 107 ఆటోమెటిక్ మిషన్ల కోసం వ్యవసాయ శాఖ ఇండెంట్ పెట్టింది. ప్రస్తుతం ఏర్పాటు చేసే కేంద్రాల కంటే ప్యాడీ క్లీనర్లు ఎక్కువగా ఉన్నా వాటిని రైతులకు ఉపయోగపడేలా చేయడంతో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిరుపయోగంగా దర్శనం
ఫ కొన్నిచోట్ల విద్యుత్ సదుపాయం లేదు.. మరికొన్ని చోట్ల సిబ్బంది సహకరించడం లేదు
ఫ విద్యుత్ సౌకర్యం ఉన్నా.. బిల్లు ఎవరు చెల్లిస్తారంటున్న నిర్వాహకులు
ఫ ఒకటి రెండు బస్తాలు తరుగు తీస్తే ఏం కాదంటూ ఉచిత సలహా


