తరలిన కూలీలు.. నిలిచిన పనులు
కోదాడ: మన ప్రాంతంలోని వివిధ పనులు నిర్వహిస్తున్న బిహార్ కూలీలు స్వరాష్ట్రానికి వెళ్లారు. ఆ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వారంతా వెళ్లడంతో వివిధ రంగాల్లో కూలీల కొరత ఏర్పడింది. రోడ్ల విస్తరణ, నిర్మాణ రంగంతో పాటు పార్‌బాయిల్డ్ మిల్లులు తీవ్ర కూలీల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆయా పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు పనులను నిలిపివేశారు.
80శాతం మంది బిహారీలే
సాగర్ ఆయకట్టులో ఉన్న పార్‌బాయిల్డ్ మిల్లుల్లో హమాలీలుగా 80 శాతం మంది బిహార్‌కు చెందిన వారు ఉన్నారు. ధాన్యం లోడ్, అన్‌లోడ్ వంటి కష్టమైన పనులను మిల్లర్లు బిహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీలతో చేయిస్తున్నారు. స్థానిక కూలీలకు ఇచ్చే కూలి రేట్లలో సగానికే వీరు పని చేస్తుండడంతో పాటు ఎక్కువ గంటలు అందుబాటులో ఉంటుండంతో వీరినే పనిలో పెట్టుకుంటున్నారు. ధాన్యం మిల్లులో అన్‌లోడ్ చేయడంతో పాటు నెట్‌కట్టడం వంటి పనులు కూడా వారే చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ ఆయకట్టులో వరి కోతలు ప్రారంభమవుతున్నాయి. వారం పది రోజుల్లో భారీ ఎత్తున ధాన్యం మిల్లులకు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో బిహార్ కూలీలు స్వరాష్ట్రానికి వెళ్లడంతో ధాన్యం దిగమతిపై ప్రభావం పడే అవకాశం ఉందని మిల్లర్లు చెబుతున్నారు.
నిలిచిన ఫ్లై ఓవర్ల నిర్మాణం
65వ నంబర్ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో వాటి నివారణకు అధికారులు బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించారు. చిట్యాల నుంచి కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వరకు గుర్తించిన బ్లాక్‌స్పాట్స్ వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టారు. ఈ పనుల్లో కీలకంగా ఉన్న బిహార్ కూలీలు ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో తమ ఓటు వేసేందుకు వెళ్లిపోయారు. దాంతో కాంట్రాక్టర్లు నిర్మాణ పనులను ఆపేశారు. వారు లేకుండా స్థానిక కూలీలతో పనులు చేయించలేమని పలువురు కాంట్రాక్టర్లు అంటున్నారు. ప్రైఓవర్ నిర్మాణంలో కీలకమైన రాడ్‌బెండింగ్‌తో పాటు భారీ యంత్రాలను నడపడం బిహార్ కూలీలు మాత్రమే చేస్తారని వారు చెబుతున్నారు.
నెల రోజులు ఇదే పరిస్థితి
బిహార్ రాష్ట్రంలో ఈ నెల 11తో ఎన్నికలు పూర్తి అవుతాయి. 14 వరకు ఫలితాలు వస్తాయి. ఐనప్పటికీ బిహార్‌కు వెళ్లిన కూలీలు రావడానికి మరో నెల రోజులు పట్టే అవకాశం ఉందని జాతీయ రహదారుల విస్తరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు అంటున్నారు. వలస కూలీలు సాధారణంగా స్వరాష్ట్రానికి వెళితే అంత త్వరగా వెనక్కి రారని చెబుతున్నారు. వారు వచ్చే వరకు ఇదే పరిస్ధితి ఉంటుందని, వారు వచ్చిన తరువాతే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అంటున్నారు. హమాలీలుగా పని చేసే వారిని ఆయా రాష్ట్రాలనుంచి త్వరగా వెనక్కి రప్పించడానికి ట్రైన్ టికెట్స్ కూడ బుక్ చేస్తున్నామని ఓ మిల్లర్ తెలిపారు.
ఫ ఎన్నికల కోసం స్వరాష్ట్రానికి
బిహార్ కూలీలు
ఫ రహదారి నిర్మాణ పనులపై
తీవ్ర ప్రభావం
ఫ పార్‌బాయిల్డ్ మిల్లుల్లో హమాలీల కొరత
ఫ మరో నెల రోజుల వరకు ఇదే పరిస్థితి


