పారిశుద్ధ్యానికి ప్రత్యేక వారం
సూర్యాపేట : పారిశుద్ధ్యానికి ప్రత్యేక వారం కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. పల్లెలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వీధులను శుభ్రం చేయడంతో పాటు తాగునీటి సరఫరా పైపులకు ఉన్న లీకేజీలను సరి చేస్తున్నారు. ఈ నెల మూడవ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం వారం పాటు కొనసాగనుంది.
పలు కార్యక్రమాల నిర్వహణ
ప్రత్యేక వారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించడం, ట్రాక్టర్లతో దానిని డంపింగ్ యార్డుకు తరలించడం, సెగ్రిగేషన్ షెడ్లు, డంపింగ్ యార్డుల నిర్వహణను పరిశీలిస్తున్నారు. దాంతో పాటు ఖాళీ స్థలాల్లో ఉన్న చెత్త, వ్యర్ధాలు, పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలను తొలగిస్తున్నారు. మురుగు కాల్వలు, పల్లె ప్రకృతి వనంలో స్వచ్ఛతా కార్యక్రమం, తాగునీటి పైప్‌లైన్ లీకేజీలకు మరమ్మతులు వంటి పనులు చేపడుతున్నారు. దాంతో పల్లెలన్నీ పరిశుభ్రంగా మారుతున్నాయి.
నిధుల లేమితో ఇబ్బందులు
వారం పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి నిధుల లేమి సమస్యగా మారుతున్నది. పారిశుద్ధ్య మెరుగు పర్చే పనులను సిబ్బంది చేపడుతున్నా పైప్‌లైన్ల లీకేజీతో పాటు ఇతర పనులు చేపట్టేందుకు అవసరమైన సామగ్రి కొనుగోలుకు వీలు లేకుండా పోతోంది. ప్రస్తుతం పాలవర్గం లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులే నిధులను సమకూర్చాల్సిన పరిస్థతి నెలకొంది. చాలాకాలంగా పంచాయతీల నిర్వహణకు కార్యదర్శులే చేతినుంచే డబ్బులు పెట్టాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు.
ఫ గ్రామాల్లో వారంరోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు
ఫ పారిశుద్ధ్యంతో పాటు నీటి పైప్‌లైన్ లీకేజీలపై ప్రత్యేక దృష్టి
ఫ పరిష్కారమవుతున్న సమస్యలు


