బిల్లులు లేకుండానే ఆడిట్‌లు పూర్తి.. ఆడిట్‌పై అనుమానాలు! | Sakshi
Sakshi News home page

బిల్లులు లేకుండానే ఆడిట్‌లు పూర్తి.. ఆడిట్‌పై అనుమానాలు!

Published Mon, Feb 19 2024 5:58 AM

- - Sakshi

దురాజ్‌పల్లి (సూర్యాపేట): జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో గత ఐదేళ్ల కాలంలో చోటుచేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆడిట్‌ ద్వారా అవినీతిని నిగ్గు తేల్చాల్సిన అధికారులు, పాలక వర్గాలతో జతకట్టారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీతిలాపాపం తలా పిడికెడుంశ్రీ అన్న చందంగా ఆడిట్‌ సమయంలో జీపీల వారీగా కమీషన్లు తీసుకొని బిల్లులు లేకుండానే ఆడిట్‌ పూర్తి చేశారనే ఆరోపణలకు ఇటీవల బయటపడుతున్న అక్రమాలు అద్దం పడుతున్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ఈ ఐదేళ్ల కాలంలో వివిధ మార్గాల ద్వారా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ వచ్చాయి. వీటిని కొందరు సర్పంచ్‌లు సక్రమంగా ఖర్చు చేయకుండా దుర్వినియోగానికి పాల్పడి రూ.లక్షల నిధులు స్వాహా చేసినట్టు వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

► నిధుల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో జనవరి 5న మఠంపల్లి గ్రామ పంచాయతీ రికార్డులను హుజూర్‌నగర్‌ ఆర్డీఓ స్వాధీనం చేసుకొని విచారణ నిర్వహించారు. 49 చెక్కుల ద్వారా రూ.74.84లక్షలను ఎంబీలు లేకుండా డ్రా చేశారని, వీటిని రికవరీ చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.

ఆ సమయంలో అక్కడ పనిచేసిన కార్యదర్శిని సస్పెండ్‌ చేశారు. ఇలా జిల్లాలోని చాలా పంచాయతీల్లో రూ.లక్షల నిధులు దుర్వినియోగమైనట్టు అధికారులు విచారణలో గుర్తించారు.

► మేళ్లచెరువు గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై కొద్దిరోజుల క్రితం జిల్లా కలెక్టర్‌కు వార్డు మెంబర్లు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ దీనిపై విచారణకు ఆదేశించాగా జనవరి 5న కోదాడ ఆర్డీఒ నేతృత్వంలోని బృందం జీపీ రికార్డులను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు.

దీంట్లో దాదాపు రూ.2కోట్లు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. స్థానిక సర్పంచ్‌కు నోటీసులు జారీ చేసి 45 రోజుల్లో నిధులు రికవరీ చేయాలని తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఏడాదికి రూ.45 కోట్లు
జిల్లాలో మొత్తం 475 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరా, వీధిలైట్ల నిర్వహణ, డ్రెయినేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తాయి. ఒక్కో వ్యక్తికి స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ ద్వారా ప్రతినెలా రూ.335, కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.201.46 చొప్పున గ్రాంట్‌ వస్తుంది.

ఇవీకాక ఉపాధి నిధులు, రిజిస్ట్రేషన్‌, మైనింగ్‌ శాఖలకు వచ్చే ఆదాయంలో 25 శాతం నిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇచ్చే సీడీపీ నిధుల్లో 75 శాతం కోత విధించి వాటిని కూడా ప్రభుత్వం పంచాయతీలకే మళ్లిస్తోంది. దీంతో జీపీలకు ఏడాదికి రూ.45 కోట్ల నిధులు విడుదలవుతున్నాయి.

ఆడిట్‌లో అభ్యంతరాలు కనబడలేదా..!
పంచాయతీ పాలకవర్గం ఆమోదం లేకుండా చిల్లిగవ్వ ఖర్చు పెట్టడానికి వీలు లేదు. ఖర్చు చేసిన ప్రతిపైసాకు బిల్లులు చూపించాలి. అయితే గత ఐదేళ్ల కాలంలో గ్రామాల్లో చేసిన పనులకు 2019–20 నుంచి 2022–23 వరకు అంటే నాలుగేళ్ల ఆడిట్‌ను పూర్తి చేశారు. ఈ సమయంలో కొన్ని అభ్యంతరాలను గుర్తించిన తర్వాత బిల్లులు చూపడంతో క్లియరెన్స్‌ ఇచ్చినట్టు సమాచారం.

ఇంతవరకు భాగానే ఉన్నా కొన్ని పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం జరిగిందని ఇటీవల ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ చేసి నిధుల దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. అయితే ఇక్కడే ఆడిట్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఆడిట్‌ చేసిన సమయంలో ఉన్న బిల్లులు ఇప్పుడెందుకు లేవనే ప్రశ్నలు తలెత్తున్నాయి.

ఆడిట్‌ సమయంలో బిల్లులు లేకున్నా అధికారులు కమీషన్‌ల కోసం కళ్లు మూసుకున్నారా.. లేక దొంగ బిల్లులు కావడంతో ఇప్పుడు చూపడం లేదా అనేది అర్థంకాని ప్రశ్నగా మారింది. పంచాయతీల్లో ఖర్చు చేసిన నిధులపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement