శ్రీకాకుళం అర్బన్: బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ జిల్లా కన్వీనర్ బి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ఉమెన్స్ కాలేజ్ రోడ్డులో గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద సాయంత్రం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు అధికారులు నిరసన కార్యక్రమం చేశా రు. ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ సెప్టెంబర్ 11వ తేదీ సమ్మె చేస్తామని, సమస్యలు పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మూడు రోజులు సమ్మె చేస్తామని అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఆఫీసర్ సంఘ నాయకులు కె.తేజేశ్వరరావు మాట్లాడుతూ 5 రోజుల బ్యాంకింగ్ డిమాండ్‌కు ఐబీఏ అంగీకరించింది. దానికి బదులుగా రోజువారీ పని గంటలను 40 నిమిషాలు పెంచడానికి యూనియన్లు కూడా అంగీకరించాయన్నారు. ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినా ఇప్పటివరకు ఆమోదం రాలేదని, దీనివల్ల ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.


