● ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు
టెక్కలి: యువ ఇంజినీర్లు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశ ప్రగతికి వినియోగించే విధంగా సామాజిక బాధ్యత తీసుకోవాలని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం నిర్వహించిన సిల్వర్ జూబ్లీ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పునరుత్పాదక ఇంధనం, సౌర విద్యుత్ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలతో పాటు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవడం వలన ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అభిప్రాయపడ్డారు. అలాగే ఉద్యోగ సాధనతో పాటు స్వయం ఉపాధి, వ్యాపార ఆలోచనలతో సరికొత్త చరిత్ర సృష్టించవచ్చునని తెలిపారు. దేశ ప్రగతికి ఉపయోగపడే విధంగా సరికొత్త ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సుమారు 300 మంది విద్యార్థులకు ఇంజినీరింగ్ డిగ్రీ పట్టాలను అందజేశారు. అలాగే ఉత్తమ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సిల్వర్ జూబ్లీ పైలాన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ వీసీ వి.వి.సుబ్బారావు, కళాశాల చైర్మన్ డాక్టర్ కె.సోమేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, డైరక్టర్లు వి.వి.నాగేశ్వరరావు, కె.మధుకుమార్, కె.రవికుమార్, టి.నాగశేషు, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, ఎస్టేట్ మేనేజర్ పి.రమేష్ పాల్గొన్నారు.


