శ్రీకాకుళం: విద్యాశాఖ నిర్వహించనున్న స్పెషల్ టెట్‌లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ ఒకే కనీస అర్హత మార్కులు నిర్ణయించాలని, ఏ సబ్జెట్‌కు వారికి ఆ సబ్జెక్టులోనే పరీక్ష నిర్వహించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్‌కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వమే ఉన్న నేపథ్యంలో ఉపాధ్యాయుల ఆందోళన దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పును సాకుగా చూపుతూ కనీస ప్రయత్నం చేయకపోవడం సరికాదన్నారు. ఓవైపు పాఠ్యాంశాలు బోధిస్తూ, ప్రభుత్వ నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలకు, కాంప్లెక్స్ సమావేశాలకు హాజరవుతూ, బోధనేతర కార్యక్రమాలతో ఉపాధ్యాయులు సతమతవుతున్నారని, ఈ క్రమంలో టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బుధవారం నుంచి జిల్లాలో బైక్ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, సెప్టెంబర్ 3న చలో విజయవాడ , అప్పటికీ విద్యాశాఖ మంత్రి చర్యలు చేపట్టకపోతే సెప్టెంబర్ 4 నుంచి రాష్ట్రం, కేంద్రంలో నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు.
నిరసన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామూర్తి, కోశాధికారి పి.సూర్యప్రకాష్, సహాధ్యక్షులు వై.ఉమాశంకర్, బి.ధనలక్ష్మి, ఎస్ నారాయణరావు, స్వర్ణకుమారి, శారద, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


