నరసన్నపేట: మడపాం టోల్‌గేట్ వద్ద ఓ పరిశ్రమలో వెల్డింగ్ పనులు చేస్తున్న చేనులవలసకు చెందిన సరిపల్లి రామచంద్రరావు (35) విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. గతంలో వంశధార పేపరు మిల్లులో పనిచేసిన రామచంద్రరావు ప్రైవేటుగా వెల్డింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ దశలో మంగళవారం పరిశ్రమలో వెల్డింగ్ పనులు చేస్తుండగా షాక్‌కు గురయ్యాడు. స్థానికులు స్పందించి నరసన్నపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు రామచంద్రరావు తల్లి మరణించగా తండ్రి అప్పన్న వృద్ధాప్యంలో ఉన్నారు. భార్య మాధవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామచంద్రరావు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం
ఆమదాలవలస/బూర్జ: శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం రైలు ఢీకొని తులగాపు శ్రీనివాసరావు(43) మృతి చెందినట్లు జి.ఆర్.పి. పోలీసులు తెలిపారు. బూర్జ మండలం లచ్చయ్యపేట కాలనీకి చెందిన శ్రీనివాసరావు భార్య రమ్య, ఇద్దరు పిల్లలు పూజిత, తరుణ్ ఉన్నారు. మద్యానికి బానిసై రెండురోజుక్రితం ఇంటి నుంచి వచ్చేశాడు. ఏం జరిగిందో గానీ రైలు కింద పడి మృతిచెందినట్లు స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు.
మనస్తాపంతో
యువతి ఆత్మహత్య
సంతబొమ్మాళి: గోవిందపురం గ్రామానికి చెందిన నీలాపు రమ్య(21) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డిగ్రీ చదువుకున్న రమ్య పలుమార్లు ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమైంది. తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో దిగులు చెందుతూ గడ్డిమందు తాగడంతో రాగోలు జెమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. రమ్య తల్లి మహాలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సంతబొమ్మాళి ఎస్సై వై.సింహాచలం మంగళవారం తెలిపారు.


