● పాఠశాలల్లో నిండుకున్న గుడ్లు
● విద్యార్థులకు వేరేకూర వండిపెట్టిన వైనం
నరసన్నపేట: ప్రభుత్వ పాఠశాలలకు గుడ్లు సరఫరాలో జాప్యం జరుగుతోంది. సకాలంలో గుడ్లు స్కూల్స్‌కు చేరవేయడంలో గుత్తేదారు నిర్లక్ష్యం వహిస్తున్నాడు. దీంతో మండలంలో ఎప్పటికప్పుడు స్కూల్స్‌లో గుడ్లు నిండుకుంటున్నాయి. ఫలితంగా హెచ్‌ఎంలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పక్క స్కూల్స్, అంగన్‌వాడీ కేంద్రాల నుంచి అప్పుగా తీసుకొని విద్యార్థులకు ఇస్తున్నారు. అప్పుగా తీసుకురావడానికి వీలులేని చోట్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో గుడ్లు ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం మండలంలో ఇదే పరిస్థితి నెలకొంది. సోమవారం నాటికి సత్యవరం, మడపాం పంచాయతీ కొత్తపేట, నరసన్నపేట పంచాయతీలోని వీడీ కాలనీ, గోపాలపెంట స్కూల్స్‌లోతో పాటు పలు స్కూల్స్‌లో గుడ్లు నిండుకున్నాయి. శనివారం నుంచీ ఈ పరిస్థితి ఉండగా ఉపాధ్యాయులు గుత్తేదారు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. సోమవారం నాటికీ గుడ్లు సరఫరా మెరుగుపడలేదు. దీంతో సత్యవరం స్కూల్ హెచ్‌ఎం అప్పలనాయుడు పొరుగున ఉన్న అంగన్‌వాడీ కేంద్రం నుంచి అప్పుగా తీసుకురాగా, మిగిలిన చోట్ల ఆ సదుపాయం లేకపోవడంతో విద్యార్థులకు గుడ్లు లేకుండానే ఆహారం వడ్డించారు. వీడీ కాలనీలో గుడ్డు బదులు మరో కూరను వడ్డించారు. కాగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సమతుల పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్య బలహీనతలు మెరుగుపరిచేందుకు వారానికి ఐదు రోజులు గుడ్డు ఇస్తున్నారు. దీంట్లో మూడు రోజులు ఉడికించిన గుడ్డు, మరో రెండు రోజులు గుడ్డు కూరను ఇస్తున్నారు. అయితే గుత్తేదారు నిర్లక్ష్యంతో విద్యార్థులకు గుడ్డు సక్రమంగా అందడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఎంఈవో యు.శాంతారావు వద్ద ప్రస్తావించగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.


