ఎస్పీ గ్రీవెన్సుకు 56 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ గ్రీవెన్సుకు 56 ఫిర్యాదులు

Aug 25 2026 1:57 AM | Updated on Aug 25 2026 1:57 AM

శ్రీకాకుళం క్రైమ్‌: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ గ్రీవెన్సుకు బాధితులు నుంచి 56 ఫిర్యాదులందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఫిర్యాదులు స్వయంగా స్వీకరించి బాధితులతో ముఖాముఖి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రతీ ఫిర్యాదుపై సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని, నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు జూమ్‌ కాన్ఫరెన్సు ద్వారా సూచించారు.

టెక్కలి సీఐపై ఫిర్యాదు

లారీ ఢీకొట్టిన ఘటనలో తన చేయి విరిగినా నేటికీ సీఐ విజయ్‌ కేసు నమోదు చేయలేదని టెక్కలి లచ్చన్నపేటకు చెందిన పి.వెంకటరమణ తన తల్లి వసంతకుమారితో కలిసి ఎస్పీ మహేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈనెల 6న లచ్చన్నపేటలో ఇంటి వద్ద నుంచి సైకిల్‌పై బయల్దేరి వస్తుండగా లారీ ఢీకొట్టిందని, అదేరోజు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరామని, ఎంఎల్‌సీ అయినా మీరు ముందు వైద్యం చేయించుకోండని తర్వాత కేసు సంగతి చూద్దామని చెప్పారన్నారు. చేతి ఎముకలు చిట్లి గాయం తీవ్రత ఎక్కువై చేతిని తీసేయాల్సిన పరిస్థితి రావడంతో శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా శస్త్ర చికిత్స జరిగిందన్నారు. ఈ జాప్యంతో తర్వాత వెళ్లి సీఐని కలిసి కేసు నమోదు చేయమని కోరగా.. ఢీకొన్న ముద్దాయిని తీసుకురావాలంటే రూ.10 వేలు ఖర్చవుతుందని, అది మీరు ఇచ్చుకోవాలనడంతో అవాక్కయ్యామన్నారు. దీనిపై తమకు న్యాయం చేయాలని కోరారు.

ఆస్తి కోసం అడ్డదారులు

టెక్కలి: తమ తండ్రి నుంచి సంక్రమించే ఆస్తులను కాజేయాలనే దుర్బుద్ధితో రెవెన్యూ అధికారులను మేనేజ్‌ చేస్తూ తన తమ్ముడు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించాడని బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. టెక్కలి తెలుకలవీధికి చెందిన కుసుమూరు మల్లేశ్వరరావు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు వేణు, చిన్న కుమారుడు మోహన్‌రావు. అయితే తండ్రి మల్లేశ్వరరావు కొద్దిరోజుల క్రితం మరణించారు. దీంతో అన్న వేణు ఊరులో లేని సమయంలో తమ్ముడు మోహన్‌రావు రెవెన్యూ ఉద్యోగులను మేనేజ్‌ చేస్తూ ఎటువంటి విచారణ లేకుండా అన్న పేరును గల్లంతు చేస్తూ ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ను సృష్టించాడు. దీంతో తండ్రి నుంచి వచ్చిన రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌తో పాటు ఆస్తులను తన సొంత పేరుకు మళ్లించుకున్నాడు. ఈ విషయమై కొన్ని రోజులుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదంటూ వేణు వాపోయాడు. ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికేట్‌ మంజూరు విషయంలో ఎటువంటి విచారణ చేయకుండా తప్పుడు పత్రాన్ని ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది.

తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించిన తమ్ముడిపై అన్న ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement