జింకు లోపంతో జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

జింకు లోపంతో జాగ్రత్త

Aug 24 2026 1:19 AM | Updated on Aug 24 2026 1:19 AM

ఆమదాలవలస: మానవ శరీరంలో జింకు కీలక పాత్ర పోషిస్తోంది. జింకు ధాతువు కణజాల వర్ధనంలో ప్రధాన పాత్ర పోషించి క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చేస్తుంది. శరీరంలో హార్మోన్లను సమతుల్య పరిచే యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. జింక్‌ ధాతువు మగవారిలో వ్యంధత్వం రాకుండా, ఆడవారికి ప్రసూతి సమయంలో మంచి ఆరోగ్యాన్నిస్తుంది. పిల్లల్లో చురుకుదనం పెరగడానికి తోడ్పడుతుంది. ఇంత ప్రాముఖ్యం కలిగిన జింకు మానవ ఆహారం ద్వారా సరైన మోతాదులో అందడంలేదు. పంట ఉత్పత్తుల్లో జింకు లేకపోవడం సరైన పౌష్టికాహారం అందని పరిస్థితి నెలకొంటోంది. ముఖ్యంగా నేలల్లో జింకు తక్కువ కావడం వల్ల పండించే పంటకు సరైన మోతాదులో జింకు అందక ఆహార పదార్థాల్లో జింకు శాతం తగ్గుతోంది. పంట ఎదుగుదల కూడా కుంటుపడుతోంది. ఆ ప్రభావం దిగుబడులపై పడుతోంది. ఈ నేపథ్యంలో జింకు లోపం రాకుండా రైతులు జాగ్రత్తలు పాటించాలని ఆమదాలవలస వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ జి.చిట్టిబాబు సూచించారు.

లక్షణాలు ఇవే..

వరి: నాటిన 2–4 వారాలలో ముదురాకు చివరలు, ఈనె ఇరుపక్కలా తుప్పు లేదా ఇటుక రంగులో మచ్చలు కనిపిస్తాయి. పైనుంచి 3, 4 ఆకుల్లో ఈనె పాలిపోతుంది. ఆకులు చిన్నవిగా ఉండి పెలుసుగా మారి శబ్దం చేస్తూ విరిగిపోతాయి.

వేరుశనగ: ఆకులు చిన్నవిగా మారి గుబురుగా కనిపిస్తాయి. ఆకు ఈనెల మధ్య భాగం పసుపుగా మారి ఈనెలు మాత్రం పచ్చగా ఉంటాయి. మొక్కలు గిడసబారతాయి.

మొక్కజొన్న: జింకులోపం వల్ల ఆకులమీద పసుపు వర్ణపు చారలు వరుసల్లో కనిపిస్తాయి. ముదిరేకొద్దీ ఆకులు పసుపు రంగుకు మారి తర్వాత తెల్లగా రంగు విరిగినట్లు కనిపిస్తాయి.

పత్తి: పత్తిలో జింకు లోపించినపుడు ఆకు ఈనెలు పచ్చగా ఉండి మధ్యభాగం పసుపు రంగులోకి మారుతుంది. కమ్మ చివరి ఆకులు చిన్నవిగా ఉండి ముడతలు పడి కణుపుల మధ్య దూరం తగ్గుతుంది.

రాగి: ఆకులపై లేత పసుపు వర్ణంలో సన్నని చారలు ఏర్పడతాయి. జింకు ధాతులోపం ఎక్కువగా ముదురు ఆకులలో కనిపిస్తుంది

నివారణ చర్యలు..

వరిలో ప్రతి ఖరీఫ్‌ సీజన్‌ ఆఖరి దమ్ములో 20 కిలోల జింక్‌ సల్ఫేట్‌ను వేసి కలియదున్నాలి. దీనివల్ల 3 పంటలు వరకు జింకు ధాతు లోపం ఉండదు. పత్తిలో కూడా 20 కిలోల జింక్‌ సల్ఫేట్‌ను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. జింక్‌లోప సవరణ కోసం 0.2 శాతం జింక్‌ సల్ఫేట్‌ 2 గ్రాములు, 80 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.

పంట ఎదుగుదలపై తీవ్ర ప్రభావం

రైతులు అప్రమత్తంగా ఉండాలి

‘సాక్షి’తో వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ చిట్టిబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement