శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా సీనియర్స్ పురుషులు, మహిళల బేస్‌బాల్ జట్ల ఎంపికలను ఈ నెల 26న శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా నిర్వహిస్తున్నట్టు జిల్లా బేస్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు తమ్మినేని సుజాత, ప్రధాన కార్యదర్శి గుంటముక్కల వీరభద్రరావు తెలిపారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఎంపికలు మొదలువుతాయని చెప్పారు. ఇక్కడ ఎంపికై న జిల్లా ప్రాబబుల్స్ జట్లకు శిక్షణా శిబిరాలు నిర్వహించిన అనతరం తుది జట్లను ప్రకటిస్తామని పేర్కొన్నారు. జిల్లా జట్లను సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని రామలక్ష్మణ క్రీడాప్రాంగణం వేదికగా జరగనున్న 8వ ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్ (అంతర్ జిల్లాల) బేస్‌బాల్ చాంపియన్‌షిప్–2026 పోటీలకు పంపిస్తామని చెప్పారు. ఆసక్తి గల క్రీడాకారులు జనన ధ్రువీకరణపత్రం, రెండు పాస్ ఫొటోలను తీసుకురావాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా బేస్‌బాల్ సంఘ కార్యనిర్వాహణ కార్యదర్శి కె.రవికుమార్ (8639000705)ను సంప్రదించాలని కోరారు.
గంజాయి నిరోధానికి డ్రోన్లు, స్నిపర్ డాగ్స్ వినియోగం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాను సమర్థంగా అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్లు, స్నిపర్ డాగ్స్ ద్వారా విస్తృత తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన నార్కో కో–ఆర్డినేషన్ సెంటర్ (ఎన్సీఓఆర్డీ) జిల్లా స్థాయి కమిటీ స మీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. సరిహద్దు చెక్ పోస్టులైన పురుషోత్తపురం, పాతపట్నం, గొప్పిలి, పైడిభీమవరం వద్ద వేలాది వాహనాలను తనిఖీ చేసి, పురుషోత్తపురం చెక్ పోస్ట్ వద్ద 1,127 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రిమ్స్‌లోని డి–అడిక్షన్ సెంటర్‌లో ఖాళీగా ఉన్న 11 పోస్టుల భర్తీ ప్ర క్రియను వేగవంతం చేసి, బాధితులకు మెరుగైన కౌన్సెలింగ్, వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. రైల్వే స్టేషన్లలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ దళాలతో కలిసి సంయుక్త తనిఖీలు నిర్వహించి రవాణాను అరికట్టాలని స్పష్టం చేశారు.


