శ్రీకాకుళం పాతబస్టాండ్: రెవెన్యూ సేవల్లో ప్రజా సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలని, అర్జీల పరిష్కారంలో నాణ్యత పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏడీ సర్వే ఎం.జోషిలా, మండల, గ్రామ సర్వేయర్లతో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఎఫ్–లైన్ సర్వే, ఆర్‌ఓఆర్ రీసర్వే ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించిన జేసీ, గడువులోగా అర్జీలను పరిష్కరించడంలో వెనుకబడిన మండలాల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎఫ్–లైన్ సర్వే దరఖాస్తుదారులకు ముందస్తు సమాచారం అందించి సరిహద్దులను వేగంగా గుర్తించాలని, క్షేత్రస్థాయి నివేదికలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఆర్‌ఓఆర్ అర్జీలకు సంబంధించి భూ విస్తీర్ణం హెచ్చుతగ్గులు, రికార్డుల సవరణ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని, తిరస్కరించే ఫైళ్లకు స్పష్టమైన కారణాలు తెలపాలన్నారు.
దోమలను నిర్మూలిద్దాం
అరసవల్లి: ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా మలేరియా నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో వైద్యశాఖ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్ శివరంజిని ర్యాలీని ప్రారంభించగా..దోమల నియంత్రణకు సూచనలు, వ్యాధుల పట్ల అప్రమత్తతపై నినాదాలు చేశారు. స్థానిక ఏడు రోడ్ల కూడలి వద్ద ప్రతిజ్ఞ చేపట్టి దోమల ఉత్పత్తి పెరగకుండా అవగాహన చర్యలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా విభాగాధికారి పి.వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కమ్మసిగడాంలో చోరీ
రణస్థలం: కమ్మసిగడాం గ్రామంలో శీల రమణమ్మ బుధవారం రాత్రి తన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి నిద్రపోయేందుకు వెళ్లింది. ఇదే అదునుగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలుగొట్టి తులం కాసుల హారం, 7 తులాల వెండి దీపం కుందులు, మొబైల్ ఫోన్, రూ.10వేలు నగదు పట్టుకుపోయారు. రమణమ్మ కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తుండగా.. భర్త అచ్చెయ్య ఏడాది క్రితమే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న క్లూస్ టీం సభ్యులు ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జె.ఆర్.పురం ఎస్సై వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అదనపు కట్నం కోసం వేధింపులు
సారవకోట: భర్త, అత్త, ఆడపడుచు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని శివరాంపురం గ్రామానికి చెందిన వివాహిత గురువారం సారవకోట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 16 ఏళ్ల క్రితం బుడితి గ్రామానికి చెందిన నక్క జగదీష్‌తో తనకు వివాహమైందని, ఆ సమయంలో కట్నం కింద రూ.2 లక్షల నగదు, 6 తులాల బంగారం, ఇతర విలువైన వస్తువులు అందించారని చెప్పారు. కొన్ని నెలలగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. సారవకోట పోలీసులు కేసు నమోదు చేశారు.


