అన్నదాతల వద్దకు అధికారుల పరుగులు | - | Sakshi
Sakshi News home page

అన్నదాతల వద్దకు అధికారుల పరుగులు

Aug 21 2026 7:39 AM | Updated on Aug 21 2026 7:39 AM

ఆమదాలవలస రూరల్‌: అన్నదాతల వద్దకు అధికారులు పరుగులు తీశారు. ఇటీవల ‘సాక్షి’ దినపత్రికలో ‘సేద్యం అసాధ్యం’ అనే శీర్షికన వార్తా కథనం వెలువడింది. దీంతో కలివరం, తొగరాం గ్రామ రైతులను అధికారులు కలిసి కావాల్సిన విధంగా ఎరువులు ఇస్తున్నామని, సాగునీటి సమస్య కూడా పరిష్కరించేలా ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తామని తెలిపారు. పత్రికల్లో వార్తలు రావడం వల్ల ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతోందని పేర్కొన్నారు. దీంతో స్పందించిన రైతులు మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు కాలువల ద్వారా సాగునీరు అందలేదని తెలిపారు. ఒకే కట్ట యూరియా ఇస్తుండడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.

చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైలు

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్‌ఓ నుస్రత్‌ మండ్రుప్కర్‌ గురువారం ఒక ప్రకటలో తెలిపారు. చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్డు ప్రత్యేక రైలు (07037) ఈ నెల 25న రాత్రి 8.30 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి, మరోసటి రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు శ్రీకాకుళం రోడ్డు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07038) ఈ నెల 26న మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీకాకుళం రోడ్డులో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. రెండు మార్గాల్లో ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విశాఖపట్నం, సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్‌లలో ఆగుతాయి.

రైల్వేట్రాక్‌పై వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కవిటి : ఇచ్ఛాపురం, ఆర్‌.బెలగాం (జాడుపుడి ఆర్‌ఎస్‌) రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి రైల్వేట్రాక్‌పై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తలకు తీవ్రగాయమై రక్తస్రావం జరిగిందని, కాళ్లు నుజ్జుగా మారాయని పలాస జీఆర్‌పీ పోలీసులు తెలిపారు. సుమారు 50–55 ఏళ్ల వయసుంటుందని, వైద్యం నిమిత్తం సోంపేట సీహెచ్‌సీకి తరలించామని చెప్పారు. తన పేరు రమేష్‌ అని, రాజాపురం గ్రామమని చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం సోంపేట సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నాడని, వివరాలు తెలిస్తే పలాస జీఆర్‌పీ ఎస్‌ఐ డి శ్రీనివాసరావు(9247585743) ను సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement