ఊరు గడప నుంచి..ప్రపంచం గుమ్మం దాకా..! | - | Sakshi
Sakshi News home page

ఊరు గడప నుంచి..ప్రపంచం గుమ్మం దాకా..!

Aug 20 2026 7:20 AM | Updated on Aug 20 2026 7:20 AM

● ఇక నుంచి ఎక్కడికై నా పోస్టల్‌ సేవలు

● 192 దేశాలకు ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌

● ఉపయోగించుకోవాలని అధికారుల సూచన

హిరమండలం:

మెరికాలో ఉన్న స్నేహితునికి పుట్టినరోజు కానుక పంపించాలనుకుంటున్నారా..? కెనడాలో ఉన్న సోదరునికి రాఖీ అందించాలా..? లండన్‌లో ఉన్న కుటుంబ సభ్యులకు ఆవకాయ రుచి చూపించాలా.. అయితే ఇంకెందుకు ఆలస్యం. మీ ఇంటికి సమీపంలోని పోస్టాఫీసు నుంచే వాటిని పంపించేందుకు అవకాశం ఉందంటున్నారు పోస్టల్‌ శాఖ సూపరింటెండెంట్‌ వండాన హరిబాబు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ.. భారత తపాలశాఖ ద్వారా ప్రజలు తమకు సమీపంలోని పోస్టాఫీసు నుంచి ప్రపంచంలోని 192 దేశాలకు వ్యక్తిగత వస్తువులు, పత్రాలు, బహుమతులు, రాఖీలు తదితరాలు సులభంగా పంపుకునే వీలుందని చెప్పారు. వ్యక్తిగత వస్తువులతో పాటు వాణిజ్య ఉత్పత్తులను విదేశాలకు పంపించాలనుకునే చిన్న ఎగుమతిదారులకు కూడా తపాల శాఖ పలు అంతర్జాతీయ సేవలను అందిస్తోందని వెల్లడించారు. సరసమైన ధరలు, విస్తృతమైన పోస్టల్‌ నెట్‌వర్క్‌, ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌, వేగవంతమైన కస్టమ్స్‌ క్లియరెన్స్‌ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. బల్క్‌ బుకింగ్‌ అవసరమైతే పోస్టల్‌ సిబ్బంది ఇంటివద్దకే వచ్చి బుకింగ్‌ చేసే సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. పోస్టల్‌ శాఖ నాలుగు రకాల సేవల ద్వారా విదేశాలకు తమ వస్తువులను పంపించేందుకు అవకాశం కల్పించింది.

192 దేశాలకు కనెక్టివిటీ

అమెరికా, కెనడా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, సింగపూర్‌, యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, సౌదీ అరేబియా తదితర దేశాలకు అంతర్జాతీయ పోస్టల్‌ సేవల ద్వారా వస్తువులను పంపుకోవచ్చని ఆయన తెలిపారు. యూనివర్సల్‌ పోస్టల్‌ యూనియన్‌(యూపీయూ) పరిధిలోని 192 దేశాలకు పోస్టల్‌ నెట్‌వర్కు ద్వారా ప్రజలకు అంతర్జాతీయ కనెక్ట్‌విటీ అందుబాటులో ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించి పంపించాలనుకునే వస్తువు, బరువు, గమ్య దేశం ఆధారంగా సరైన అంతర్జాతీయ సేవను ఎంచుకోవాలని సూచించారు.

అంతర్జాతీయంగా పంపేందుకు ప్రధాన సేవలు

ఇంటర్నేషనల్‌ రిజిస్టర్‌ పోస్టు

విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆస్తి సంబంధిత పత్రాలు, సర్టిఫికెట్లు తదితర ముఖ్యమైన డాక్యుమెంట్లను పంపేందుకు ఈ సేవను ఉపయోగించుకోవచ్చన్నారు. ఉదాహరణకు అమెరికాలోని అన్ని రాష్ట్రాలకు 20 గ్రాముల బేస్‌ ధర రూ.215 ఉండగా.. పన్నుతో కలిపి దాదాపు రూ.258 అవుతుంది.

ఎక్స్‌ప్రెస్‌ మెయిల్‌ సర్వీస్‌

డాక్యుమెంట్లును మరింత వేగంగా విదేశాలకు పంపించేందుకు ఈ ఎంఎస్‌ సేవ ఉపయోగపడుతుంది. అమెరికాకు 250 గ్రాముల వరకు బేస్‌ధర రూ.1,820 ఉండగా.. పన్నులతో కలిపి దాదాపు రూ.2184 అవుతుంది.

ఇంటర్నేషనల్‌ ట్రాక్‌ ప్యాకెట్‌ సర్వీసు

రాఖీలు, దుస్తులు, పుస్తకాలు, పూజా సామగ్రి, బహుమతులు తదితర తక్కువ బరువున్న వ్యక్తిగత వస్తువులను పంపించేందుకు ఈసేవ అనుకూలంగా ఉంటుంది. 250 గ్రాముల వరకు బేస్‌ ధర దాదాపు రూ.500 కాగా.. పన్నులతో కలిపి రూ.600 అవుతుంది.

పోస్టల్‌ ఎయిర్‌ పార్సెల్‌

250 గ్రాములకు మించిన బరువున్న వస్తువులను విదేశాలకు పంపించేందుకు ఎయిర్‌ పార్సిల్‌ సేవను వినియోగించుకోవచ్చు. 250 గ్రాముల వరకు బేస్‌ధర రూ.1,000 కాగా.. పన్నులతో కలిపి 1,180 అవుతుందన్నారు. కాగా అంతర్జాతీయ పోస్టల్‌ చార్జీలు, పంపే దేశం, వస్తువు, బరువు, సేవ రకం వర్తించే పన్నులు తదితర అంశాల ఆధారంగా ధర మారే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement