అరసవల్లి: జిల్లా పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా నాలుగో సారి ఎన్నికై న కిల్లారి నారాయణరావును జిల్లా పరిషత్ సీఈవో ఆర్.వెంకట్రామన్ సత్కరించారు. బుధవారం స్థానిక కార్యాలయంలో ఉద్యోగుల సమస్యలపై చర్చల అనంతరం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మేరకు ఆప్షన్ ఫారాన్ని సమర్పించేందుకు మరో రెండు రోజులు గడువు పెంచాలని సంఘం తరపున సీఈవో వెంకట్రామన్‌కు విన్నవించారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.
తండ్రికి తలకొరివిపెట్టిన తనయ
కవిటి: ప్రగడపుట్టుగలో కిడ్నీ మహమ్మారికి మరొకరు బలయ్యారు. బదకల వెంకటరావు(54) అనే వ్యక్తి కిడ్నీవ్యాధులతో బాధపడుతూ బుధవారం మృతిచెందాడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, చిన్న కుమార్తెకు మరో 10 రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన అంత్యక్రియల్లో రెండో కుమార్తె ఝాన్సీ తండ్రికి తలకొరివి పెట్టింది.
ద్విచక్ర వాహనం నుంచి మంటలు
ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణ శివారులోని కృషి విజ్ఞాన కేంద్రం సమీపంలో ఆమదాలవలస – శ్రీకాకుళం రహదారిపై బుధవారం జరిగిన ప్రమాదంలో ద్విచక్రవాహనం నుంచి మంటలు చెలరేగి పూర్తిగా కాలిబూడిదైంది. ఆమదాలవలస ఫైర్ ఎస్‌వో శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. పొందూరు మండలం గోకర్నపల్లికి చెందిన అన్నెపు దిలీప్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై కుటుంబంతో ఎల్‌ఎన్‌పేట మండలం మల్లికార్జునపురంలో జరిగిన శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆమదాలవలస ప్రాంతంలో బైక్ ఆగిపోయింది. బైక్ స్టార్ట్ చేస్తుండగా స్పార్కింగ్ వచ్చి పెట్రోల్ ట్యాంకుకు తగలగా మంటలు చెలరేగాయని తెలిపారు. ఈ మంటలను అదుపు చేసేందుకు ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేశారని వెంటనే వెళ్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చేసరికి పూర్తిగా బైక్ కాలిపోయిందని తెలిపారు. వాహనదారులు, దిలీప్ ముందుగా మంటలను గమనించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.
దళిత యువతిని మోసగించిన కేసులో ఇద్దరికి రిమాండ్
శ్రీకాకుళం క్రైమ్ : బాపట్ల కారంచేడుకు చెందిన దళిత యువనటి కనుపర్తి దీనమ్మ అలియాస్ దివ్యశ్రీని ప్రేమించి వివాహం చేసుకుని మోసగించిన పాలకొండ అటవీ రక్షణ అధికారి గొల్లంగి తారకేశును మహిళా స్టేషన్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతనితో పాటు సాయిరామ్‌మహా పాత్రో అనే మరో వ్యక్తిని సైతం జైలుకు పంపించారు. ఈ నెల 31 వరకు రిమాండ్‌లో కొనసాగుతారని పోలీసులు పేర్కొన్నారు.
బాలుడి అదృశ్యంపై ఫిర్యాదు
టెక్కలి: శ్యామసుందరాపురం గ్రామానికి చెందిన గయా వివేకానంద అనే 16 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. ఈ మేరకు తండ్రి యుగంధర్ టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఈ నెల 16న రాత్రి 11 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమారుడు తిరిగి రాలేదని పేర్కొన్నారు. బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు.


