● రిమ్స్ ఆవరణలో జూడాల ర్యాలీ
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాలలోని జూనియర్ డాక్టర్లు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి రెండో రోజుకు చేరుకున్నాయి. గడిచిన పది రోజులుగా వీరు మూడు న్యాయమైన డిమాండ్లతో ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మంగళవారం నుంచి రిలే నిరాహార దీక్షలను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ నిరసన దీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్లు రిమ్స్ ఆవరణలో ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డాక్టర్ రోహన్, డాక్టర్ శివకుమార్, డాక్టర్ లిఖిత, డాక్టర్ సూర్యతేజ, డాక్టర్ గ్రీష్మ, డాక్టర్ లక్ష్మీ చరణ్, డాక్టర్ ప్రణీత, డాక్టర్ మజ్జి హేమలతా దేవి తదితరులు దీక్షల్లో పాల్గొన్నారు.
అవుట్ పేషెంట్ల అవస్థలు
జూడాల దీక్షల నేపథ్యంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే అవుట్ పేషెంట్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ రిజిస్ట్రేషన్ సౌలభ్యం చేసుకునే అవకాశం ఉండడంతో వారంతా ఆ సమయానికి వచ్చి రిజిస్టర్ చేయించుకుంటున్నారు. గతంలో జూనియర్ డాక్టర్లు వార్డుల్లోని రోగులకు ఫాలోఅప్ ట్రీట్మెంట్ జరిపేవారు. ఇప్పుడు వారు లేకపోవడంతో సీనియర్ వైద్యులే వార్డులకు వెళ్లి రోగులను పరిశీలించాల్సి వస్తోంది. ఈ కారణంగా వారు ఓపీకి వచ్చేసరికి 11.30 గంటలు దాటిపోతుంది. అప్పటివరకు రోగులకు నిరీక్షణ తప్పడం లేదు. అలాగే ఒంటి గంట తర్వాత మధ్యాహ్న భోజన విరామ సమయం కావడంతో వైద్యులు వెళ్లిపోతున్నారు. వారు తిరిగి 3 గంటలకు వచ్చి రోగులను పరీక్షిస్తున్నారు. ఉదయం పరీక్షలు జరిపించుకోలేని రోగులు, వైద్యుల కోసం సాయంత్రం 4 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఇటువంటి పరిస్థితి ఉందని జిల్లావ్యాప్తంగా తెలియడంతో అవుట్ పేషెంట్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈనెల ఒకటి, రెండు తేదీల్లో 2,000 వరకు ఉన్న ఓపీల సంఖ్య, మంగళవారం నాటికి 1870కు తగ్గింది. ఇలా రోజురోజుకు అవుట్ పేషెంట్ల సంఖ్య తగ్గిపోతోంది. అలాగే జిల్లాలోని ఇతర ఆస్పత్రులు సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల నుంచి రిఫరల్ కేసులు కూడా రిమ్స్‌కు కాకుండా విశాఖపట్నం వంటి సుదూర ప్రాంతాలకు పంపిస్తున్నారు. అయితే అక్కడ కూడా ఇటువంటి పరిస్థితి నెలకొని ఉండడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు.


