శ్రీకాకుళం పాతబస్టాండ్: లేబర్ కోడ్లు రద్దు చేసి కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్‌ల వద్ద నిరసన కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబులు చేపడుతున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు, కార్మికులు, సంఘాలు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఆశా, అంగన్‌వాడీ, ఆర్‌పీలు తదితర స్కీం వర్కర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కొత్త పీఆర్‌సీ అమలు చేయాలన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, వలస కార్మికులకు వలస కార్మిక చట్టం అమలు చేయాలని, గిగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.అప్పలరాజు, ట్రైమేక్స్ యూనియన్ అధ్యక్షులు వై.సూర్యనారాయణ, టి.జి.ఐ.యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.అప్పలరాజు, హమాలీ యూనియన్ నాయకులు లబ్బరాజు, చిన్నారావు, సివిల్ సప్లయ్ యూనియన్ నాయకులు మెహన్‌రావు, నారాయణ, స్కూల్ స్వీపర్ల యూనియన్ ప్రతినిధి భాను తదితరులు పాల్గొన్నారు.


