వజ్రపుకొత్తూరు రూరల్: అక్రమ కేసులో అంపోల్ జైలులో రిమాండ్‌లో ఉండి ఈ నెల 14న బెయిల్‌పై వచ్చిన మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును ఆయన స్వగృహంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై రాజకీయ కక్ష సాధింపులతో తప్పుడు కేసులు పెట్టి, అక్రమంగా అరెస్టులు చేస్తోందని మండిపడ్డారు. పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షులు ఉర్లాన బాలరాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఎరుకోల వెంకటరమణ, పల్లి యోగి, పార్టీ నాయకులు హనుమంతు వెంకటరావుదొర, ఎస్.ప్రదీప్, మీసాల రామకృష్ణ, పి.మునిరావు, ఏ.సూర్యం, ఎం.సింహాచలం, బమ్మిడి పున్నయ్య పాల్గొన్నారు.
అక్రమ కేసులకు భయపడేది లేదు
ఆమదాలవలస: అక్రమంగా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసేందుకు టీడీపీ ప్రభుత్వం చూస్తోందని, కేసులకు భయపడేవారు వైఎస్సార్ సీపీలో ఎవరూ లేరని పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. అక్రమ కేసులో జైలుకు వెళ్లి కోర్టు నుంచి బెయిల్‌పై విడుదలైన ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ను పార్టీ ముఖ్య నాయకులతో కలిసి మంగళవారం ఆమదాలవలస పార్టీ కార్యాలయంలో పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై మంత్రి అచ్చెన్నాయుడు పరుష పదజాలం ఉపయోగించడాన్ని ఖండించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రతిపక్ష నేతలపై సంస్కారహీనంగా మాట్లాడటం సరికాదన్నారు. అనంతరం రవికుమార్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్‌కుమార్, జిల్లా మహిళా విభాగ ఉపాధ్యక్షురాలు బొడ్డేపల్లి అజంతాకుమారితో మాట్లాడి అక్రమ కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.


