● భద్రతా లోపంతో విద్యార్థులకు ఇక్కట్లు
● కురుడు బీసీ బాలుర వసతి గృహం సంఘటనే నిదర్శనం
● వార్డెన్ సస్పెన్షన్, వాచ్‌మెన్ తొలగింపు చర్యలతో సరిపెట్టేస్తారా..?
టెక్కలి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ వసతి గృహాలపై సవతి ప్రేమ చూపిస్తోంది. గత ప్రభుత్వం వరకు సంక్షేమ వసతి గృహాల్లో భద్రతతో పాటు అన్ని రకాల మౌళిక సదుపాయాలు ఉండేవి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ వసతి గృహాల్లో తరచూ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
కొన్ని ఘటనలు..
● వసతి గృహాల్లో భద్రత ఎంత డొల్లతనంగా ఉందో రెండు రోజుల క్రితం కోటబొమ్మాళి మండ లం కురుడు బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థి మృతి ఘటన తేట తెల్లం చేసింది.
● దానికి కొంత కాలం ముందు మెళియాపుట్టి మండలం భరణికోట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని మేడ మీద నుంచి కిందకు దూకేసింది.
● జి.సిగడాంలో గల కేజీబీవీ వసతి గృహానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు హాస్టల్ నుంచి ఎవరికీ తెలియకుండా ఇంటికి వెళ్లిపోయారు.
● కోటబొమ్మాళి కేజీబీవీలో ఓ విద్యార్థిని మేడ మీద నుంచి కిందకు దూకేసింది.
● గార మండలంలో కేజీబీవీలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో డయేరియా వ్యాప్తి చెందింది.
తొలగిస్తే సరిపోతుందా..?
కోటబొమ్మాళి మండలం కురుడు బీసీ బాలుర వసతిగృహానికి చెందిన 6వ తరగతి విద్యార్థి ముద్దాడ దుర్గాప్రసాద్ మృతి కేవలం సిబ్బంది నిర్లక్ష్యమేనని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇప్పటికే వార్డెన్ లక్ష్మణరావును సస్పెండ్ చేయడంతో పాటు వాచ్‌మెన్‌ను విధుల నుంచి తప్పించినట్లు ఏబీసీడబ్ల్యూఓ త్రినాథరావు వెల్లడించారు. ప్రస్తుతానికి నిమ్మాడ వార్డెన్ శివప్రసాద్‌కు కురుడు హాస్టల్ బాధ్యతలను అప్పగించా రు. బాధిత కుటుంబానికి వార్డెన్ కొంత మొత్తాన్ని పరిహారంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంఘటనపై వార్డెన్ సస్పెన్షన్, వాచ్‌మెన్ తొలగింపు చర్యలతో సరిపెట్టేస్తారా లేక భద్రత విషయంలో పటిష్టమైన చర్యలు తీసుకుంటారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొన్ని చోట్ల ఒక్కో వార్డెన్‌కు రెండు నుంచి మూడు హాస్టల్స్ బాధ్యతలను అప్పగించడంతో ఆ భారంతో పర్యవేక్షణ పూర్తిగా గాలికొదిలేస్తున్నారు. సంఘటనలు జరిగినపుడు హడావుడి చర్యలు తప్ప ఆ తర్వాత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.


