నేడు జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

నేడు జాబ్‌మేళా

Jun 24 2026 1:29 AM | Updated on Jun 24 2026 1:29 AM

శ్రీకాకుళం న్యూకాలనీ : శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ (అటానమస్‌) కళాశాలలో ‘ఉన్నతి’ ఫౌండేషన్‌ సహకారంతో బుధవారం మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.సూర్యచంద్రరావు, ఉన్నతి ఫౌండేషన్‌ ప్లేస్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ కోఆర్డినేటర్‌ బి.రంజిత్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నస్‌ ఇన్‌స్ట్రూమెంట్స్‌, వోల్టాస్‌, అపోలో ఫార్మసీ, దూత్‌ ట్రాన్స్‌మిషన్స్‌, టీవీఎస్‌, డాటా క్రాప్‌, విస్ట్రాన్‌ వంటి 15 కంపెనీలు పాల్గొంటున్నాయని చెప్పారు. సుమారు 600 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, డిప్లమో, ఎంఎల్‌టీ, ఫార్మసీ తదితర అర్హతలు కలిగిన యువతీ యువకులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు బయోడేటా, ఒరిజినల్‌ ధ్రువపత్రాలు, జిరాక్స్‌ కాపీలు, ఆధార్‌ కార్డు, రెండు పాస్‌ఫొటోలతో ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణం వద్దకు చేరుకోవాలని సూచించారు.

ఉత్తీర్ణత శాతం పెరగాలి

నరసన్నపేట: రెసిడెన్షియల్‌ కళాశాలల్లో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత శాతం పెరగాలని ఏపీఎస్‌డబ్ల్యూ ఆర్‌ఐఈఎస్‌ జాయింట్‌ సెక్రటరీ కె.రాజ్యలక్ష్మి అన్నారు. తామరాపల్లిలోని మహిళా రెసిడెన్సియల్‌ కళాశాలను మంగళవారం తనిఖీ చేశారు. భోజన వసతి, తరగతుల నిర్వహణ తదితర అంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కళాశాల సిబ్బందికి, వంట ఏజెన్సీ ప్రతినిధులకు తగు సూచనలు చేశారు. ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక కార్యాచరణ అవసరమన్నారు. ఐఐటీ, నీట్‌ వంటి పోటీ పరీక్షలకు తీర్చిదిద్దాలన్నారు. ఈమె వెంట డీసీఓ వై.యశోదలక్ష్మి ఉన్నారు.

పారా లీగల్‌ వలంటీర్లకు శిక్షణ

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఖైదీలకు, వన్యప్రాణుల దాడి బాధితులకు చట్టప్రకారం సకాలంలో న్యాయ సహాయం అందించడంలో పారా లీగల్‌ వలంటీర్ల పాత్ర కీలకమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నూతనంగా ప్రవేశపెట్టిన పలు పథకాలపై వలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. జైళ్లలో ఉన్న ముద్దాయిలు, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీ ల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ‘స్పృహ’ పథ కం గురించి వివరిస్తూ.. ఖైదీలపై ఆధారపడిన వారి కుటుంబ సభ్యులకు, ఖైదీలకు నడుమ వలంటీర్లు సమన్వయకర్తలుగా వ్యవహరించాలన్నారు. ఉచిత న్యాయవాదిని నియమించడంలో సహాయం చేయాలని సూచించారు. అడవుల సరిహద్దు ప్రాంతాల్లో జరిగే మానవ – వన్యప్రాణి సంఘర్షణల వల్ల నష్టపోయే బాధితులకు ఈ నూతన పథకం ద్వారా న్యాయం పొందేలా తగిన అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement