ఇన్ని లోపాలు ఏంటి సర్‌? | - | Sakshi
Sakshi News home page

ఇన్ని లోపాలు ఏంటి సర్‌?

Jun 24 2026 1:29 AM | Updated on Jun 24 2026 1:29 AM

కవిటి: కవిటి బెహరావీఽధిలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) ప్రక్రియ లోపభూయిష్టంగా జరుగుతోందని వైఎస్సార్‌సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్‌ రెడ్డి ఆరోపించారు. మంగళవారం పార్టీ రాష్ట్ర బీసీ విభాగం కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్‌, సల్ల దేవరాజ్‌తో కలిసి కవిటి బెహరావీధిలోని పలు పోలింగ్‌ స్టేషన్లకు సంబంధించిన ఓటర్ల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా బీఎల్‌వోలు విధులు నిర్వహించడం తగదన్నారు. 89వ పోలింగ్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ఇంట్లో ఆరుగురు ఓటర్లు ఉండగా వారిలో కేవలం ముగ్గురికే ఎస్‌ఐఆర్‌ ఫారాలు అందించి మిగిలిన వారికి ఇవ్వలేదన్నారు. బీఎల్‌ఏగా ఉన్న బెందాళం రమణమూర్తికి కూడా ఒక్క ఫారం మాత్రమే అందజేశారని చెప్పారు. బీఎల్‌ఏకే ఇలా జరిగితే నిరక్ష్యరాస్యులైన ఓటర్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇంటింటికి వెళ్లకుండా అందరినీ ఒకేచోటికి రప్పించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. 92వ పోలింగ్‌ కేంద్రం బీఎల్‌ఓ జానకిరావు.. నాగుల గిరిదాస్‌ అనే వ్యక్తి ఇంట్లో ఐదుగురు ఓటర్లకు గాను ఇద్దరికే ఫారాలు ఒక్కొక్కటి ఇచ్చారని, దీనిపై ప్రశ్నించగా రెండు ఇస్తే పోగొట్టుకుంటారని తన వద్ద ఉంచేశానని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కవిటి మండల కేంద్రంలోనే ఈ తరహా పనితీరు కనిపిస్తుంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఇటీవల కలెక్టర్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సైతం తహసీల్దార్‌ టి.కల్యాణచక్రవర్తి మాట్లాడుతూ బీఎల్‌ఓలను నియంత్రించలేకపోతున్నానని చెప్పడం గమనార్హం.

23 ఓట్ల తొలగింపునకు కుట్ర!

సారవకోట: చిన్నకిట్టాలపాడు పంచాయతీ బొంతుగూడలో 23 మంది గిరిజనుల ఓట్లు తొలగించేందుకు స్థానిక టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేశారు. మంగళవారం విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ మండల కమిటీ ఉపాధ్యక్షుడు బొంగు కొండయ్య, డీఎల్‌డీఏ చైర్మన్‌ నక్క తులసీదాస్‌లు గ్రామానికి చేరుకుని బీఎల్‌ఏలతో మాట్లాడారు. దీంతో గిరిజనులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. 23 మంది ఓటర్ల వివరాలు ఆన్‌లైన్లో నమోదు చేయాలని, తుది జాబితాలో వారి పేర్లు లేకపోతే పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తామని నాయకులు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement