● 1998 డీఎస్సీ ఉపాధ్యాయుల ఆందోళన
● మొత్తం ఖాళీలు చూపించడం లేదని
ఆవేదన
శ్రీకాకుళం: జిల్లాలో 2008 డీఎస్సీ ఉపాధ్యాయులు 108 మందికి జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించి పాఠశాలలను కేటాయించారు. ప్రతిఏటా వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి పాఠశాలలను కేటాయిస్తూ ఉంటారు. దీనిలో భాగంగా సోమవారం వీరికి కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరితోపాటు 1998 ఎంటీఎస్ ఉపాధ్యాయులకు కూడా కౌన్సెలింగ్ కోసం పిలిచారు. వీరంతా కలిసి 321 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే 1998 డీఎస్సీకి చెందిన ఉపాధ్యాయులకు రాష్ట్ర అధికారులు ఇచ్చిన హామీ మేరకు కౌన్సెలింగ్ జరగలేదంటూ వారు ఆందోళన చేపట్టారు. కౌన్సెలింగ్ హాల్ ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేసి జిల్లా విద్యాశాఖ అధికారిని నిలదీశారు. జిల్లాలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను చూపించాలని డిమాండ్ చేశారు. అయితే జిల్లా విద్యాశాఖ అధికారులు రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు 321 ఖాళీలను మాత్రమే చూపించారు. దీనికి 1998 ఉపాధ్యాయులు అంగీకరించకుండా అన్ని ఖాళీలు చూపించాల్సిందేనని పట్టుబట్టి కౌన్సెలింగ్ బహిష్కరించారు.
అధికారుల చర్యలు సరికాదు
ఈ సందర్భంగా 1998 డీఎస్సీ ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రతి ఉపాధ్యాయుడు 50 నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారని, ఎటువంటి అలవెన్సులు లేకుండా అతి తక్కువ జీతానికి పనిచేస్తున్న తమకు మరింత దూరం వెళ్లేలా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం సరికాదని వాపోయారు. 321 స్థానాలు మాత్రమే ఖాళీగా చూపిస్తే.. తమకంటే ముందు నియమించబడిన 2008 ఉపాధ్యాయులు 108 మంది ఉన్నారని, వారంతా దగ్గరలోని ఖాళీలను కోరుకుంటే తాము సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలి సభ్యులు రాష్ట్ర అధికారులతో మాట్లాడినప్పుడు అన్ని ఖాళీలను చూపిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. రాత్రి 8 గంటల వరకు ఈ వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. ఇదిలా ఉండగా వీరి డిమాండ్‌కు తలొగ్గి అన్ని ఖాళీలను చూపిస్తే 2008 ఉపాధ్యాయులకు రీ కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.


