అరసవల్లిలో భానుసప్తమి సందడి | - | Sakshi
Sakshi News home page

అరసవల్లిలో భానుసప్తమి సందడి

Jun 22 2026 12:12 AM | Updated on Jun 22 2026 12:12 AM

అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకున్న భక్తులు

సిబ్బంది చేతివాటంపై భక్తుల అసంతృప్తి

అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో భానుసప్తమి పర్వదినం సందర్భంగా భక్తుల సందడి కనిపించింది. స్థానికులతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకబృందం రూ.300 వీఐపీ టికెట్లు కొనుగోలు భక్తులకు అంతరాలయ దర్శనాన్ని చేయించారు. ఈవో కె.ఎన్‌.వి.డి.వి.ప్రసాద్‌, ఏఈవో అప్పలనాయుడు ఆధ్వర్యంలో భక్తులకు మౌలిక సౌకర్యాలు కల్పించారు. సీఎంఆర్‌ గ్రూప్‌ యాజమాన్యం ఉచితంగా పరమాన్నం, పెసల మొలకలు ప్రసాదాలు పంపిణీ చేశారు.

సిబ్బంది చేతివాటం..

కేశఖండన శాలలో తలనీలాల మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లిన భక్తుల నుంచి కనీసంగా రూ.50 నుంచి రూ.100 వరకు వసూళ్లు అదనంగా చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్టు ధర రూ.40 కాగా.. అదనంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారని, లేదంటే గుండుపై చిన్నపాటి గాయాలయ్యేలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. మరుగుదొడ్లు, స్నానాల గదులు, రావిచెట్టుకు దీపం పెట్టిన చోట, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం వద్ద కూడా డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కేశఖండన శాల వద్ద అక్రమ వసూళ్లుపై ఈఓకు పలు ఫిర్యాదులు చేరడంతో అక్కడ పనిచేస్తున్న ఒకరిద్దరిని రెండు వారాల పాటు సస్పెండ్‌ చేశారు. అయినప్పటికీ సిబ్బందిలో మార్పులు కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

క్యూలైన్‌లలో భక్తులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement