మందస : మందస మండల కేంద్రంలోని శ్రీ రాజా శ్రీనివాస స్మారక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తమ పిల్లలను కూడా అదే బడిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారని ప్రధానోపాధ్యాయుడు మక్కా శ్రీనివాసరావు అన్నారు. తోటి ఉపాధ్యాయులు డి.నాగేశ్వరరావు, జ్ఞానేశ్వర్ గౌడ, డి.ఢిల్లీ, అరుణ్‌కుమార్ పాడి, కిషోర్‌గౌడ్‌లు తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చదివించడం మిగిలిన వారికీ స్ఫూర్తిగా ఉంటుందని అభినందించారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యా బోధన అందుతుందని పేర్కొన్నారు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
రణస్థలం: గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట(నదీ ప్రవాహం)లో పోతిరెడ్డి మురళి(24) అనే యువకుడు సరదాగా ఈతకు దిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. దీంతో స్వగ్రామం లావేరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. మురళి హైదరాబాద్‌లోని విప్రో కంపెనీలో సాఫ్ట్‌వేరు ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. తన స్నేహితుడి సోదరికి నీట్ పరీక్ష కేంద్రాన్ని విజయవాడలో కేటాయించారు. దీంతో ముగ్గురూ విజయవాడ వచ్చాడు. ఆదివారం ఆమె పరీక్ష రాసేందుకు వెళ్లగా.. పక్కనే కరకట్టలో ఈత కొట్టేందుకు మురళి దిగాడు. ప్రమాదవశాత్తు మునిగిపోయి చనిపోయాడు. స్థానికులు గమనించి మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో స్వగ్రామం లావేరులో విషాదఛాయలు అలముకున్నాయి. మురళి తండ్రి వెంకటరమణ ఉప్పు వ్యాపారం చేస్తుంటారు. తల్లి సరళ గృహిణి. సోదరి ప్రసన్నకు వివాహం నిశ్చయమైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఒక్కగానొక్క కుమారుడు మరణవార్త తెలియగానే కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడ బయలుదేరి వెళ్లారు.
ఆంజనేయ గుడిలో చోరీ
బూర్జ: సింగన్నపాలెం గ్రామ సమీపంలో పాలకొండ–శ్రీకాకుళం రోడ్డులోని ఆంజనేయ ఆలయంలో శనివారం రాత్రి హుండీ చోరీ జరిగింది. మూడేళ్ల నుంచి గ్రామస్తులు ఈ హుండీని తెరవలేదు. ఆదివారం ఉదయం గ్రామస్తులు ఆలయం వద్దకు వెళ్లెసరికి హుండీ చోరీ జరిగిన విషయం గుర్తించారు. ఈ విషయమై గ్రామానికి చెందిన తులగాపు శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ ఎం.ప్రవల్లిక, సిబ్బంది పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.


