● ఘనంగా యోగా దినోత్సవం
శ్రీకాకుళం కల్చరల్: ఒత్తిడి, ఆందోళన, అనారోగ్య సమస్యలను అధిగమించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డచ్ భవనం వద్ద ఆదివారం భారీ ఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.
ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ యువత యోగా చేయడం అలవాటు చేసుకుంటే భవిష్యత్‌లో వారికి ఆరోగ్యకరమైన జీవనానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. యోగా సోలో, సింక్రనైజ్డ్, యోగ స్లోగన్, వ్యాసరచన, తదితర యోగా పోటీల్లో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు, మెమెంటోలను బహూకరించారు. సాంస్కృతిక ప్రదర్శనలో భాగంగా శ్రీకాంత్ శిష్యబృందం నృత్య ప్రదర్శన, యోగా పై గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగి పాట పాడి వినిపించారు. యోగా గురువులు పాండ్రంకి మురళీకృష్ణ, పతంజలి నుంచి చినబాబు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి సుధారాణి తదితరుల యోగాసనాలను తెలియజేశారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష, జిల్లా పరిషత్ సీఈఓ వెంకటరామన్, డీఆర్‌డీఏ పీడీ కిరణ్ కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హెచ్.కూర్మారావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె.అనిత, జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వినాయక, ఆర్ అండ్ ఎస్‌ఈ ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


