నాలుగు కేంద్రాల్లో జరగనున్న పరీక్షలు
ఉదయం 11 నుంచి పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతి
మధ్యాహ్నం 2 నుంచి 5.20 గంటల వరకు పరీక్ష
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఆదివారం జరగనున్న నీట్– 2026 రీ–ఎగ్జామ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. శ్రీకాకు ళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ, కేంద్రీయ విద్యాల యం పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష కేంద్రంలో వసతులు, ఫర్నీచర్, సీసీ కెమెరాల నిఘా, భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఇతర అధికారులు పరిశీలించారు.
నాలుగు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 2,112 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. ట్రిపుల్ ఐటీ లో 720 మంది, ఆర్ట్స్ కళాశాలలో 696 మంది, కేంద్రీయ విద్యాలయంలో 447 మంది, ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 240 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మే 3వ తేదీన నీట్–2026 ఎగ్జామ్ జరగగా.. పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకేజీ అయిన ఉదంతంతో పరీక్షను రద్దుచేసిన విషయం తెలిసిందే. దీంతో ఎట్టకేలకు మళ్లీ నీట్ రీ–ఎగ్జామ్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఉదయం 11 నుంచి లోపలకు అనుమతి..
నీట్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరగనుంది. అభ్యర్థులను ఉదయం 11 గంటల నుండి లోపలకు అనుమతించనున్నారు. మ ధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే లోపలకు అనుమతిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. మధ్యాహ్నం 1.30 దాటిన తర్వాత నిమిషం ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి రానిచ్చేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కేంద్రం లోపల కేవలం చీఫ్ సూపర్‌వైజర్‌కు మా త్రమే మొబైల్ అనుమతిస్తున్నారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ వస్తువులు, పరికరాలు తీసుకురావడానికి వీల్లేదని అధికా రులు హెచ్చరిస్తున్నారు.
మౌలిక సదుపాయాలు తప్పనిసరి..
పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల సౌకర్యార్థం తాగునీరు, ఎండదెబ్బ తగలకుండా టెంట్లు, ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షలు అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు విద్యార్థులంతా అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు.
నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
శ్రీకాకుళం క్రైమ్ : నీట్ (యూజీ) –2926 పునఃపరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరిపేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలసి ఎస్పీ ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ, ప్రభుత్వ పాలిటెక్నిక్, కేంద్రీయ విద్యాలయ, ఆర్ట్స్ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను సందర్శించారు. సీసీ కెమెరాలు, నిఘా, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నాలుగు పరీక్ష కేంద్రాలకు డీఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో ప్రతి కేంద్రానికి ఓ సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులతో పాటు పోలీసు సిబ్బందిని నియమిస్తామన్నారు.
అభ్యర్థులు ముందుగా రావాలి..
సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వంటి పరికరాలు అనుమ తి లేకుండా కేంద్రాల వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు ద్వారా తనిఖీలు నిర్వహించి అభ్యర్థులకు లోపలికి అనుమతిస్తామన్నారు. కేంద్రాల సమీపంలో జిరాక్స్ షాపులు, అనధికార కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఆమదాలవలస రైల్వేస్టేషన్, శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. అభ్యర్థులకు తోడుగా వచ్చేవారు గూమిగూడకుండా సహకరించాలని, ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరించినా పరీక్ష నిబంధనలు ఉల్లంఘించేందుకు ప్రయత్నించినా చట్టపరమైన చర్యలుంటాయన్నారు. హాల్‌టికెట్లలో పేర్కొన్న నియమాలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, చిన్న ఘటనలు జరిగినా తక్షణమే 112కు సమాచారమివ్వాలని ఎస్పీ తెలిపారు.


