పర్యవేక్షణ శూన్యం..! | - | Sakshi
Sakshi News home page

పర్యవేక్షణ శూన్యం..!

Jun 20 2026 11:49 AM | Updated on Jun 20 2026 11:49 AM

క్షేత్రస్థాయిలో పర్యటించాలి అవగాహన కల్పించాలి

పశువులకు సీజనల్‌ వ్యాధుల భయం

అవగాహన కల్పించని అధికారులు

ఆందోళన వ్యక్తం చేస్తున్న పాడి రైతులు

సీజనల్‌ భయం..

పశు సంవర్ధక ఽశాఖ అధికారులు దిగువ స్థాయిలో సిబ్బందిపై పశువైద్య సేవల బాధ్యతలు పెట్టకుండా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తే సమస్యలు గుర్తించవచ్చు. సీజనల్‌గా వచ్చే వ్యాధులు గురించి పాడి రైతులకు గ్రామాల్లో అవగాహన కల్పించాలి. సిబ్బంది పనితీరు మెరుగుపరచాలి.

– పైడి మోహనరావు, మతలబుపేట, సరుబుజ్జిలి

పశువులకు సీజనల్‌గా వ్యాపించే అంటువ్యాధులపై పాడి రైతులకు అంతగా అవగాహన ఉండడం లేదు. దీనివలన తరుచూ పశువులకు వ్యాపిస్తున్న వ్యాధులతో నానా ఇక్కట్లు పడుతున్నాము. పశువైద్య శాఖ అధికారులు పశువుల పెంపకం, సంక్రమించే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించాలి. లంపిస్కిన్‌ వ్యాధితో అప్పట్లో చాలావరకు పశునష్టం చవిచూశాం.

– చల్ల యర్రయ్య, చిగురువలస, సరుబుజ్జిలి

సరుబుజ్జిలి: ఇటీవల పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు గోతుల్లో నీరు చేరింది. దీంతో మనుషులు మాదిరిగా పశువులకు కూడా అనేక రకాల అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సీజనల్‌గా వచ్చే వ్యాధులపై పాడి రైతులు అప్రమత్తంగా ఉండి పలు ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వ్యాధుల నివారణకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పాడి రైతులకు అవగాహన కల్పించడంలో శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో లంపిస్కిన్‌(ముద్దచర్మ వ్యాధి) వ్యాపించి చాలావరకు పశువుల నష్టాలు జరిగాయి. అలాంటి నష్టాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

కార్యాలయాలకే పరిమితం

వాస్తవానికి పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా(ఏడీ) ఉన్న ఉద్యోగి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి తమ సిబ్బందిని అప్రమత్తం చేయాలి. ఈవిధంగా తరుచూ పర్యటించి సీజనల్‌గా పశువులకు వ్యాపిస్తున్న అంటువ్యాధులు, వాటి నివారణా చర్యలు గురించి పాడి రైతులకు అవగాహన కల్పించాలి. గ్రామాల్లో పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. అప్పుడు దిగువ స్థాయి సిబ్బంది కూడా సక్రమంగా పనిచేస్తారు. అయితే ఏడీ స్థాయిలో ఉన్న ఉద్యోగులు మండల పశువైద్య కార్యాలయం నుంచి బయటకు కదలకపోవడంవలన పశువైద్యం ఆశించిన స్థాయిలో అందడం లేదన్న విమర్శలు పాడి రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. దీనిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలని పాడి రైతులు కోరుతున్నారు.

పశువులకు సంక్రమించే వ్యాధులు

చిటుకు వ్యాధి

గొర్రెల్లో చిటుకువ్యాధి అధికంగా వస్తుంది. ఇది బ్యాక్టీరియా వలన వస్తుంది. ఉన్నటుండి గాలిలో ఎగిరి గొర్రెలు చనిపోతాయి. దీని నివారణకు ముందుగా నీరసంగా ఉన్న గొర్రెలను మంద నుంచి వేరుచేయాలి. వ్యాధి నివారణకు పెన్సిలిన్‌ వేయించాలి. వ్యాధి సోకని వాటికి వ్యాక్సిన్‌ వేయించాలి.

నీలి నాలుక

నీలి నాలుక గొర్రెలు, మేకల్లో వస్తుంది. ఈ వ్యాధి సోకిన జీవాలకు జ్వరం అధికంగా వస్తుంది. నోటి నుంచి చొంగ కారుస్తూ, గిట్టలకు పుండ్లు ఏర్పడతాయి. ఈ వ్యాధి నివారణకు యాంటీ బయాటిక్స్‌, లివర్‌ టానిక్‌ ఉపయోగించాలి. జీవాలను మంద నుంచి వేరు చేయాలి.

గొంతువాపు వ్యాధి

ఈ వ్యాధి అన్ని వయస్సుల ఆవులు, గేదెల్లో కనిపిస్తుంది. 105 నుంచి 108 డిగ్రీల జ్వరం వస్తుంది. నోటి నుంచి చొంగలు కారి, నోటి నుంచి గాలి పీల్చుకుంటాయి. గొంతవద్ద వాపు వలన మేత తీసుకోలేవు. నివారణకు సల్పాడిమిడిన్‌ వాడుతూ, 4 నెలలు దాటిన జీవాలకు వ్యాక్సినేషన్‌ చేయించాలి.

గాలికుంటు వ్యాధి

ఇది అన్ని జీవాల్లో కనిపిస్తుంది. నోటి, గిట్లల్లో పుండ్లు, ఎక్కువగా జ్వరం ఉంటుంది. నివారణకు బోరిక్‌ గ్లిజరిన్‌ ఆయింట్‌మెంట్‌ను నోటిలో పూత పూయాలి. పీపీ ద్రావణంతో కాలిగిట్ల మధ్య కడగాలి. ప్రతిఏటా ముందస్తుగా ఏప్రిల్‌, మే నెలల్లో వ్యాక్సిన్‌ వేయించాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement