శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): చంద్రబాబు రెండేళ్ల పాలనలో దళితులకు, బీసీలకు రక్షణ కరువైందని, గాదె సాయికృష్ణ ఉదంతం పూర్తికాకుండానే విజయవాడ కృష్ణలంకలో దళిత మాదిగ యువకుడు క్రాంతికుమార్ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నాడ రుషి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆత్మహత్య చేసుకోక ముందు సెల్ఫీ మరణ వాంగ్మూలం రికార్డ్ చేస్తూ మరణించిన తీరు చూస్తుంటే, చంద్రబాబు పాలనలో దళితులకు రక్షణ లేదని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. దళితులకు ఈ రాష్ట్రంలో జీవించే హక్కు.. భద్రత లేదా? అని ప్రశ్నించారు. దళిత యువకుడు వేధింపులకు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే అది ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ నిర్మాణాన్ని పక్కనపెట్టి.. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుచేయడం ఎంతవరకు సమంజసమన్నారు.


