ఇచ్ఛాపురం రూరల్: విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ ఘటన విషాదకరమైన ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. గురువారం ఆయన ఇచ్ఛాపురంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. తన కొడుకును చంపేస్తే కనీసం శవమైనా ఇవ్వండీ, లేకపోతే బూడిదైనా ఇవ్వండి అని ఒక తల్లి వేడుకోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని, దోషులు ఎవరైనా చట్టం ముందు నిలబెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో సామాన్యులకు భద్రత లేకుండా పోయిందని, రెడ్‌బుక్ రాజ్యాంగంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
సోంపేట : గొల్లూరు గ్రామానికి చెందిన పిన్నింటి ఊర్వశి (38) గురువారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. గురువారం రాత్రి 7 గంటల సమయంలో మంచంపై విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు వెంటనే బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది మార్చి 13న ఊర్వశి భర్త పిన్నింటి రాజారావు అదే ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఇప్పుడు ఊర్వశి మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. బారువ ఎస్‌ఐ హరిబాబునాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవపంచనామా అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఊర్వశి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.


