● నిర్వాహకులకు కార్పొరేషన్
అధికారుల షాక్
● కట్టెల పొయ్యి వినియోగించకూడదని నోటీసులు
శ్రీకాకుళం :
నగరంలో హోటళ్ల యజమానులకు నగరపాలక సంస్థ అధికారులు షాక్ ఇచ్చారు. ఇకపై హోటళ్లు, రెస్టారెంట్లలో కట్టెల పొయ్యి వినియోగించకూడదని నోటీసులు జారీ చేశారు. కర్రలతో వండటం వల్ల పొగ వస్తోందని, దీనివల్ల పలువురు అనారోగ్యం బారిన పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయని నోటీసుల్లో పేర్కొనడం గమనార్హం. అయితే, నగరంలో కొన్ని దశాబ్దాలుగా కొందరు వర్తకులు ఊకపొయ్యిలనే వినియోగిస్తున్నారు. వాస్తవానికి దీనివల్లే అధికంగా పొగ వెలువడుతుంది. ఇదే విషయమై గతంలో ఫిర్యాదులు వచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ఇలాగైతే కష్టం..
కమర్షియల్ సిలిండర్ల కొరత, ధర విపరీతంగా పెరగడం వంటి కారణాల వల్లే కట్టెల పొయ్యిలు కొనసాగిస్తున్నామని రెస్టారెంట్, హోటళ్ల యజమానులు చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావంతో సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, దీనివల్ల వ్యాపారాలు చేయడం కష్టతరం అవుతోందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారాలు లేక తీవ్ర ఆందోళన చెందుతుండగా కార్పొరేషన్ అధికారులు తాజాగా ఇటువంటి నోటీసులు జారీ చేయడం తగదని తప్పుపడుతున్నారు. ఈ విషయమై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి సమస్యను వివరించాలని వారంతా నిర్ణయించుకున్నారు.


