● పెరిగిన పెట్టుబడుల భారం
● దుక్కులపై డీజిల్ ధరల ప్రభావం
● ప్రభుత్వ ప్రోత్సాహం కరువు
ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులకు ధరల బెంగ పట్టుకుంది. ఇప్పటికే ఎరువుల ధరలు పెరగ్గా, యుద్ధ ప్రభావంతో డీజిల్ ధరలు సైతం పెరుగుతుండటంతో అన్నదాతలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొద్దిరోజులుగా అడపా దడపా కురుస్తున్న వర్షాలతో చాలాచోట్ల రైతులు దుక్కులకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో డీజిల్ లీటర్‌పై పది రోజుల వ్యవధిలో రూ.8 వరకు పెరగడంతో ట్రాక్టర్ యజమానులు అద్దెలు పెంచేశారు. దీంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ట్రాక్టర్‌తో దున్నేందుకు గంటకు రూ.1000, రోటావేటర్‌తో రూ.1250 వరకు వసూలు చేసిన యజమానులు ఈ ఏడాది రూ.1200 నుంచి రూ.1450 వరకు డిమాండ్ చేస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
పొంచి ఉన్న ఎల్‌నినో ముప్పు
ధరలు పెంపునకు తోడు ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని రైతులు కలవరపడుతున్నారు. ఈ ప్రభావం పంటల సాగుపై పడే అవకాశం లేకపోలేదని ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయం చూసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితులు కనిపించడం లేదు.
–హిరమండలం


