పంటకు శ్రీరామరక్ష! | - | Sakshi
Sakshi News home page

పంటకు శ్రీరామరక్ష!

Jun 15 2026 7:22 AM | Updated on Jun 15 2026 7:22 AM

భూసార పరీక్ష.. పంటకు శ్రీరామరక్ష! ● భూసార పరీక్షలతో లాభసాటి వ్యవసాయం ● అధిక దిగుబడులకు సూక్ష్మ పోషకాలే కీలకం ● నమూనాల సేకరణలో మారిన విధానం ● పరీక్షలకు వేసవి అనుకూల సమయం

ఎంతో మేలు..

భూసార పరీక్ష..
● భూసార పరీక్షలతో లాభసాటి వ్యవసాయం ● అధిక దిగుబడులకు సూక్ష్మ పోషకాలే కీలకం ● నమూనాల సేకరణలో మారిన విధానం ● పరీక్షలకు వేసవి అనుకూల సమయం

ఆమదాలవలస: కాలం మారింది. పద్ధతులు మారుతున్నాయి. సాగు విధానాలు కూడా మారాలి. ఇన్నాళ్లూ సీజన్‌లను అనుసరించి పంటలు వేసేవారు. ఇకపై భూమి సారాన్ని అంచనావేసి ఏ పంట వేయాలి.. ఏ ఎరువు వాడాలి అని నిర్ధారించుకునే సమయం ఆసన్నమైంది. పంట సాగు చేసే ముందు ప్రతి రైతు దీనిపై అవగాహన పెంపొందించుకోవాలి. పంట కోతలు ముగిసిన నెలరోజులకు మట్టి నమూనా సేకరించాలి. భూసార పరీక్ష వల్ల ఏ పంట పండించాలో తెలుస్తుంది. ఏ ఎరువు ఎంతవేయాలో తెలుస్తుంది. ఈ పరీక్ష చేయడం వల్ల అటు భూమికి ఇటు పంటకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గి, దిగుబడులు పెరగాలంటే భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి.

పోషకాలు గుర్తించకుండానే..

జిల్లా 90 శాతం రైతులు పంటలకు కావాల్సిన పోషక విలువలు తమ భూమిలో ఉన్నాయో, లేదో తెలుసుకోకుండానే పంటలు సాగు చేస్తున్నారు. దిగుబడుల కోసం రసాయన ఎరువులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఫలితంగా ఖర్చులు తప్ప దిగుబడులు పెరగడంలేదు. అంతేకాకుండా ఎరువుల వల్ల భూమిలో సహజ సిద్ధంగా ఉండే పోషకాలు నశించిపోతున్నాయి.

జీపీఎస్‌ విధానంలో..

ఆధునికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో అమలు చేస్తూ రైతులు మెరుగైన దిగుబడులు సాధించేలా గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో పలు పరికరాలతో భూసార పరిశోధన స్థానాలను మెరుగుపరిచారు. ఇందులో భాగంగానే మోతాదుకు మించి రసాయన ఎరువుల వినియోగాన్ని నియంత్రించడంతో పాటు రైతులకు పెట్టుబడి భారం తగ్గించేలా వ్యవసాయాధికారులు సలహాలిస్తున్నారు. భూసార పరీక్షల ఆధారంగా నేలలో ఉన్న పోషకాలను గుర్తించి పంటల సాగు చేపట్టేలా రైతులను చైతన్య పరుస్తున్నారు. ఇందుకోసం జీపీఎస్‌ ద్వారా మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మూడేళ్లకోసారి తప్పనిసరి..

పొలంలో సేకరించిన మట్టిని ప్రయోగశాలలో భౌతిక, రసాయన పద్ధతుల్లో విశ్లేషించి నేల స్వభావం, లక్షణాలు, పోషక విలువల స్థాయి గుర్తిస్తారు. ఈ ఫలితాల ఆధారంగా ఏ పంటకు ఎంత మోతాదులో పోషకాలు అవసరమో తెలుస్తుంది. దీంతో మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. భూమిలో లోపించిన వాటిని గుర్తించి దానికి అనుగుణంగా ఎరువులను వేసుకోవడం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. ప్రతి మూడేళ్లకు ఒకసారి భూసార పరీక్షలు చేయించడం మంచిదని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి..

● పొలంలో ఎరువులు వేసిన తర్వాత నెలరోజుల వరకు మట్టి సేకరించకూడదు. పంటకు నీరు పెట్టిన తర్వాత, నీడ ప్రదేశాలు, ఎరువుల కుప్పలున్న చోట, గట్లు, చెట్ల వద్ద నమూనాలు తీయరాదు.

● పంటకోత తర్వాత వేసవిలో పంటలు లేని సమయాల్లో భూసార రీక్షలక మట్టి నమూనాలు సేకరించాలి. పొలంలో వి ఆకారంలో 15–20 సెంటీమీటర్లు లోతున పారతో గుంత తీసి అందులో పై పొర నుంచి కింది వరకు ఒక పక్కగా మట్టిని సేకరించాలి.

● పొలం మొత్తంగా 8–10 చోట్ల సేకరించిన మట్టిని ఒకచోట చేర్చి బాగా కలిపి నాలుగు భాగాలను మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా మట్టి అరకిలో వచ్చేవరకు చేస్తుండాలి. ఇలా సేకరించిన మట్టిలో రాళ్లు గడ్డి వేరుచేసి నీడలో అరబెట్టాలి. బాగా ఆరిన తర్వాత ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో గానీ, పాలిథీన్‌ కవర్‌లో గానీ నింపి రైతు వివరాలు రాసి భూసార పరీక్ష కేంద్రాలకు పంపాలి. మట్టి సేకరణకు స్థానిక రైతు సేవా కేంద్రం సిబ్బంది సాయం తీసుకుంటే వారే రైతు పొలం వద్ద మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్ష కేంద్రాలకు పంపుతారు.

సూక్ష్మపోషకాలు కీలకం..

అధిక దిగుబడులు సాధించాలనే తపనతో మితిమీరి రసాయన ఎరువులు వాడటం వల్ల భూమిలోని పోషకాలు నశించిపోతున్నాయి. పొటాష్‌ను ఎక్కువగా వాడడం వల్ల మెగ్నీషియం, జింక్‌ ఇనుము వంటి సూక్ష్మపోషకాలు మొక్కకు అందకుండా పోతున్నాయి.జింక్‌ లోపం కారణంగా మొక్క ఎదుగుదల తగ్గి దిగుబడులపై ప్రభావం చూపుతోంది. సూక్ష స్థూల పోషకాలతో పాటు నైట్రోజన్‌ సేంద్రియ కర్బనాల స్థాయి చాలా కీలకం . సేంద్రియ కర్బనం లోపిస్తే భూమి తన సహజ స్వభావాన్ని కోల్పోతుంది. ఎంత ఎరువు వేసినా భూమి గ్రహించకుండా నిస్సారమైపోతుంది. భూమిలో సేంద్రియ కర్బనం 0.5 శాతం నుంచి 0.76 శాతం వరకు ఉంటే సాధారణంగా పరిగణిస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చాలా చోట్ల భూమిలో ఇది 0.1 శాతం నుంచి 0.20 శాతం వరకే ఉన్నట్లు పరీక్షలు ఫలితాలతో తెలుస్తోంది.

భూసార పరీక్షల ఆధారంగా పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయి. పరీక్షలు చేసి మండలంలో రైతులకు కార్డులు అందించే కార్యక్రమం చేపడుతున్నాం. ఈ ఏడాది కూడా భూసార పరీక్షలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రసాయన ఎరువులు అధికంగా వాడటం వల్ల భూమిలో సారం తగ్గి పంట దిగుబడి తగ్గిపోతుంది. భూసార పరీక్షలపై ఇప్పటికే గ్రామ వ్యవసాయ సహాయకుల శిక్షణ కార్యక్రమ పూర్తిచేశాం.

– మెట్ట మోహనరావు,

మండల వ్యవసాయాధికారి, ఆమదాలవలస

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement