శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి శివారు భూముల వరకు నీరిస్తామన్న హామీకి రెండేళ్లు గడిచినా ఎందుకు నిధులు కేటాయించడం లేదో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి.తులసీదాసు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని సుందరయ్య భవన్‌లో ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని, జీడికి గిట్టుబాటు ధర, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని, వంశధార నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, శ్రీకాకుళంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేసి సుందర శ్రీకాకుళంగా తీర్చిదిద్దుతామని హామీలు గుప్పించినా అందులో ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. పాలకుల నిర్లక్ష్యమే జిల్లా వెనుకబాటుకి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో నాటి షట్టర్ కుంభకోణం తర్వాత నేటి వరకు వంశధార కాలువలకు షట్టర్లు బిగించకపోవడంతో శివారు భూములకు నీరు వెళ్లక రైతులు తీవ్రమైన ఇబ్బందు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వంశధార బ్యారేజ్ నిర్మాణం పూర్తయి 50 ఏళ్లు కావడంతో శిథిలావవస్థకు చేరుకుందని, ఆధునీకరణ కోసం రూ.1500 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదనలు పంపినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కేంద్ర సంస్థలైన సింపు నుంచి ఎందుకు నిధులు కేటాయించడం లేదని ప్రశ్నించారు. సుదీర్ఘ పోరాట ఫలితంగా నేరేడు బ్యారేజీ నిర్మాణముకు గజిట్ నోటిఫికేషన్ వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి పని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రూ 200 కోట్లు కేటాయిస్తూ లిఫ్ట్ ద్వారా తాత్కాలికంగానైనానా వంశధార రిజర్వాయర్ నింపి రైతులకు నీరు ఇవ్వచ్చని, ఆ పని కూడా ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ సముద్రతీర ప్రాంతాన్ని రేర్ ఎర్త్ మినరల్ పేరుతో ఆదానివంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కార్గో ఎయిర్‌పోర్టు పేరుతో ఉద్దానం విధ్వాంసానికి పూనుకుంటున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళంలో నాగావళి నది జలకాలుష్యాన్ని నివారించి ప్రజలకు మంచినీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు భవిరి కృష్ణమూర్తి, కోనారి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.


