నరసన్నపేట : శిష్టకరణాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని, ఇందుకోసం కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులు అవసరమైన చర్యలు తీసుకోవాలని నరసన్నపేట శిష్టకరణ సంఘం అధ్యక్షుడు సదాశివుని రాంబాబు విజ్ఞప్తి చేశారు. ఆదివారం నరసన్నపేటలోని శిష్టకరణ సంఘ భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం తరఫున కేంద్ర,రాష్ట్ర మంత్రులతో పాటు నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిని కలిసి వినతిపత్రాలు ఇచ్చేందుకు తీర్మానం చేశామని తెలిపారు. సోమవారం నుంచి నిర్వహించనున్న ఎస్‌ఐఆర్(సర్) కార్యక్రమంలో శిష్టకరణ సంఘ సభ్యులు తమ ఓట్లు పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బీఎల్‌ఓలు ఇంటికి వచ్చేటప్పుడు అవసరమైన సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు గోవిందరావు, బలివాడ కృష్ణారావు, కస్పా ప్రసాద్, సదాశివుని సింహాచలం, చౌదరి కాంతారావు, కుప్పిలి వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.


