అపోహలు వీడితేనే..
ఎవరు రక్తదానం చేయవచ్చు?
శ్రీకాకుళం కల్చరల్ : రోడ్డు ప్రమాదాలు, అత్యవసర ఆపరేషన్లు సమయంలో సకాలంలో రక్తం అందక ఎంతోమంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతమందిని కలిసినా రక్తం యూనిట్లు అందక కుటుంబ సభ్యులు నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. అతికష్టమ్మీద కొందరు మాత్రమే రక్తం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు తప్ప అవగాహన లేమి, భయం, సమాచార లోపం కారణంగా రక్తదానం చేసేందుకు చాలా మంది ముందుకు రావడం లేదు. జిల్లాకు ఏడాదికి దాదాపు 60వేల యూనిట్ల రక్తం అవసరం. సేకరిస్తున్నది మాత్రం కేవలం 16 వేల యూనిట్లే. ఈ వ్యత్యాసాన్ని సరిదిద్దే ప్రక్రియ జరగడం లేదు. దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే సమస్య పరిష్కారానికి ఆస్కారం ఉంటుంది.
పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి రక్తదానంపై అవగాహన కల్పిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ రక్తదాన శిబిరాల ఆవశ్యకత వివరిస్తున్నారు. నేను కూడా రక్తదానం చేస్తున్నా.
– పి.చైతన్యకుమార్, రెడ్‌క్రాస్ వలంటీర్
రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేసిన తరువాత 48 సార్లు రక్తదానం చేశాను. ప్రతి ఏడాది పెళ్లిరోజుకు, ఆగస్టు 15న తప్పనిసరిగా రక్తదానం చేస్తాను. అత్యవసరమైన వారికి కూడా రక్తదానం చేస్తాను.
– మధుకల్యాణ్,
మెడికల్ రిప్రజెంటేటివ్
జిల్లాలో రెడ్‌క్రాస్‌తో పాటుగా శ్రీకాకుళం రిమ్స్, మూడు ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. నరసన్నపేట, పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లోనూ రక్తనిధి కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటన్నిటి ద్వారా ఏడాదిలో కేవలం 16 వేల యూనిట్లు మాత్రమే సేకరణ జరుగుతోంది.
శ్రీకాకుళంలోని రక్తనిధి కేంద్రం
చాలా మందిలో రక్తదానం అంటే భయం, అపోహలు ఉన్నాయి. రక్తం గురించి తెలుసుకుంటే ఆ భయం పోతుంది. రక్తదాన ప్రక్రియలో కేవలం 300 మిల్లీలీటర్లు మాత్రమే స్వీకరిస్తారు. సాధారణంగా మనిషిలో సరాసరి 5 లీటర్ల నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. కేవలం 300మి.లీ. రక్తం దానం చేయడం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. ప్రమాదం జరిగినపుడు లీటరు వరకు రక్తం పోతుంది. సుఖప్రసవంలో తల్లి 700మి.లీ.రక్తం కోల్పోతారు. అయినా బాలింత బలహీనపడరు. ఈ సత్యం గుర్తించి రక్తదానానికి ముందుకు రావాలని బ్లడ్‌బ్యాంకుల నిర్వాహకులు కోరుతున్నారు.
అత్యవసర వేళల్లో ఆదుకుంటున్న రక్తదాతలు
21 ఏళ్లుగా రక్తనిధి కేంద్రంలో రక్త సేకరణ
రక్తదానంపై అపోహలు వీడాలంటున్న నిర్వాహకులు
రేపు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
18 నుంచి 60 ఏళ్ల వయసు కలిగి ఆరోగ్యంగా ఉన్నవారు ఎవరైనా రక్తదానం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.బీపీ, షుగర్ వంటి వ్యాధులు ఉన్నవారు రక్తదానం చేయకూడదు. ప్రతి వ్యక్తిలో కనీసం ఐదులీటర్ల రక్తం ఉంటుంది. ఏడాదిలో నాలుగు సార్లు రక్తదానం చేయవచ్చు. సినీ హీరోల పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయవచ్చు. తమ పుట్టిన రోజుల సమయంలోనూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి స్ఫూర్తిగా నిలవవచ్చు. యువజన సంఘాలు, కళాశాలలు, ఉద్యోగ సంఘాలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్, సత్యసాయి సేవా సంస్థలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.


