శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు అన్నారు. సీఎం చంద్రబాబు జిల్లాకు వచ్చిన సందర్భంగా గోవిందరావు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహనరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి. సింహాచలం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పోలాకి ప్రసాద్‌లను అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. సీఎం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా సమస్యలను తప్పుదోవ పట్టించడానికి అక్రమ అరెస్టులకు పూనుకుంటున్నారని విమర్శించారు. కార్గో ఎయిర్‌పోర్టు ప్రతిపాదన రద్దు చేయాలని, కొవ్వాడ అణుపార్కు రద్దు చేయాలని, సముద్రతీర ప్రాంతాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పొద్దని, బలవంతపు భూసేకరణ ఆపాలని, సరుబుజ్జిలి థర్మల్ పవర్ ప్లాంట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు.
టెక్కలి: ప్రజా రవాణా వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలనే ప్రధాన డిమాండ్‌తో శనివారం టెక్కలి ఆర్టీసీ డిపో ఎదుట ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ విలువైన ఆస్తులను ప్రైవేట్‌పరం చేయాలనే ఆలోచన మానుకోవాలని, స్తీశక్తి పథకం నిర్వహణకు అవసరమైన 3 వేల కొత్త బస్సులు వేయాలని, విద్యుత్ బస్సు ఆపరేటర్ల కోసం డిపోలను ఖాళీ చేయించే ఆలోచనలు మానుకోవాలని, ఎలక్ట్రికల్ బస్సులను సంస్థ సొంతంగా నిర్వహించాలని ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు జాయింట్ సెక్రటరీ ఎస్.రాజులు, డిపో ప్రెసిడెంట్ కే.బీ.రావ్, మురళి, డీఎల్ రా వ్‌తో పాటు మిగిలిన నాయకులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం అర్బన్: మెళియాపుట్టి మండలం ముక్తాపురం గ్రామంలో పాతపట్నం మాజీ ఎమ్మెల్యే (1972–78) చుక్క పగడాలమ్మ మరణంపై కాంగ్రెస్ నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు. పగడాలమ్మ చిత్ర పటానికి పూలమాలతో నివాళులు అర్పించి కాంగ్రెస్ పార్టీకి ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పగడాలమ్మ నిరాడంబర జీవితం, నిస్వార్థ రాజకీయం ఇప్పటి రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయంగా ఉండాలన్నారు. ప్రజాసేవే పరమావధిగా భావించి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని అందుపుచ్చుకొని అనంతరం సామాన్య జీవితాన్ని అనుభవించారని గుర్తుచేసుకున్నారు.


