● సీఎం పర్యటనపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్ ఘాటు విమర్శలు
నరసన్నపేట: జిల్లా వెనుకబడిపోవడానికి ప్రధాన కారణం టీడీపీ అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులు కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగాయని గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్ సీపీని గొడ్డలి పార్టీ అని చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండించారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎన్‌సీఆర్‌బీ నివేదిక అంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండి పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన 23 నెలల్లో ఒక్క కొత్త పరిశ్రమ జిల్లాకు తీసుకువచ్చారా.. అని సూటిగా ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. జిల్లాలో మొక్కజొన్న రైతులు నిలువునా మోసపోతుంటే వారి కోసం ఒక ప్రకటన చేయలేకపోయారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పర్యటన అంతా ఆర్భాటమే తప్ప జిల్లాకు ఒరిగింది ఏమీ లేదన్నారు. ఉత్తరాంధ్ర వలసల నివారణ, జిల్లా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చెప్పినవన్నీ పాత ముచ్చట్లేనని కృష్ణదాస్ అన్నారు. వంశధార, మడ్డువలస, నేరడి బ్యారేజి, జంఝావతి గురించి మా ట్లాడిన చంద్రబాబు గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌మోహనరెడ్డి హయాంలోనే భోగాపురం ఎయిర్ పోర్టు, మూలపేట పోర్టు, బుడగట్ల పాలెం హార్బర్, ఉద్దానం కిడీ రీసెర్చ్ సెంటర్ వంటి చారిత్రాత్మక ప్రాజెక్టులు నిర్మిస్తే.. వాటికి రంగులేసుకుంటూ టీడీపీ తన ఖాతాలోకి వేసుకోవడం సిగ్గు చేటన్నారు. పలాసలో ఎయిర్‌పోర్టు నిర్మిస్తామనడం ప్రజలను మళ్లీ మోసం చేయడమేనన్నారు.


