● ప్లేఆఫ్స్ సమీపిస్తున్న వేళ రూ.లక్షల్లో అర్జన
● కోల్‌కతాలో విశాఖ బెట్టింగ్ ముఠా అరెస్టు
● జిల్లాలో ముఠా కదలికలపై ప్రత్యేక బృందాల నిఘా
ఐపీఎల్
పోరు..
శ్రీకాకుళం క్రైమ్ : ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ దేశవ్యాప్తంగా మంచి జోరు మీద సాగుతోంది.. ఇటీవలే విశాఖ పోలీసులు కోల్‌కతాలో అతిపెద్ద బెట్టింగ్ ముఠాలోని 8 మంది బుకీలను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 234 బ్యాంకు అకౌంట్లు (మ్యూల్‌ఖాతాలు) గుర్తించి రూ.500 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నిర్ధారించారు. విస్తరించిన బెట్టింగ్ సామ్రాజ్యంలోని మరికొంతమంది రూ.1500 కోట్ల వరకు లావాదేవీలు జరిపివుంటారని అంచనా వేశారు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ సమీపిస్తున్న వేళ ఈ బెట్టింగ్ జోరు మరింత ఊపందుకున్నట్లు సమాచారం. ‘జిల్లాలో ఎటువంటి బెట్టింగ్ ముఠాలు లేవు.. ఎటువంటి డెన్‌లు లేవు.. వారి ఆటలు ఇక్కడ సాగడం లేదు..’ అంటూ పోలీసులు బయటకు చెబుతున్నా చాపకింద నీరులా ఇక్కడో ‘డాన్ బుకీ’ తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తుండటంతో ఆధారాలతో సహా పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
నేతల అండదండలతో..
ఒకప్పుడు చిన్నా చితకా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ, కేసులను ఎదుర్కొంటూ పోలీసుల నుంచి తప్పించుకుని బెట్టింగ్‌నే ఇంటిపేరుగా మార్చుకున్న ఓ వ్యక్తి ఇప్పుడు రూ.కోట్లకు పడగలెత్తి నాయకుల అండదండలతో బెట్టింగ్ మాఫియాలో ‘కీ’రన్నర్‌గా ఉన్నాడన్న ప్రచారం జరుగుతోంది. మరో కీలక బుకీతో కలసి గోవా కేంద్రంగా మన జిల్లాలోని 10 మంది నిర్వాహకులతో కలసి బెట్టింగ్ నడుపుతున్నట్లు ప్రచారంలో ఉంది. కోల్‌కతా కేంద్రంగా మరో కీలక వ్యక్తి మరో 9 మందితో కలసి బెట్టింగ్ నడుపుతున్నట్లు సమాచారం. తానేం చేయడంలేదని పోలీసుల వద్ద నమ్మబలుకుతూనే కీప్యాడ్ మొబైళ్లను నిర్వాహకులకిచ్చి అంతా మేనేజ్ చేస్తున్నట్లు భోగట్టా.
ప్రత్యేక యాప్‌ల ద్వారా..
విదేశాల్లో లభ్యమయ్యే ప్రత్యేక బెట్టింగ్ యాప్‌లలో ఓ యాప్‌ను కొనుగోలు చేసిన మన బుకీడాన్ కూడా విశాఖలో పట్టుబడిన గబ్బర్ మాదిరిగానే గోవా కేంద్రంగా చేసుకుని మరికొన్ని రాష్ట్రాల వ్యక్తులతో కలసి సిండికేట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బుకీడాన్ ఇచ్చిన కీప్యాడ్ మొబైల్ నుంచి వచ్చే రిసీవ్‌కాల్ ద్వారా నిర్వాహకులు ఇక్కడ బెట్టింగ్‌పై ఆసక్తి ఉండే యువకులను ముఖ్యంగా వ్యాపార వర్గాల వారిని ఎంచుకున్న ప్రదేశానికి పంపించడం.. లేదంటే ఆట కొనసాగేటప్పుడు వారికి లింక్‌పంపించి మొబైల్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసేలా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దీనిలో ప్రధానంగా బోత్90 గేమ్ నడుస్తోంది. అంటే గేమింగ్‌లో బాల్ టు బాల్ (బాల్‌కు సిక్స్ వస్తుందని, వికెట్ వస్తుందని, బౌండరీ వస్తుందని ఇలా.. ), ఓవర్ టు ఓవర్ (ఓవర్‌లో ఎక్కువ రన్‌లు కొడతారని, ఎక్కువ వికెట్లు తీస్తారని), మ్యాచ్ టూ మ్యాచ్ (ఇండియా గెలుస్తుందని, లేదా వేరే దేశం గెలుస్తుందని) ఆటగాడు సెంచరీ కొడతాడని, కొట్టడని మొత్తంపైన ఎస్ ఆర్ నో ఉంటుంది. మనం బెట్టింగ్‌లో రూ. లక్ష పెడితే గెలిస్తే రూ. 90 వేలు అదనంగా వస్తుంది. ఓడితే రూ.లక్ష పోతుంది. అంటే నిర్వాహకులకు వెళ్లేది 10 శాతం కమీషన్..
ఆ వివరాలిస్తే అంతే..
విశాఖ మారికివలసకు చెందిన రవిశంకర్ తన ప్రమేయం లేకుండా డబ్బులొస్తాయనే ఆశతో బెట్టింగ్ మాఫియాకు చెందిన త్రినాథ్, జగదీష్‌లకు 60 మ్యూల్‌ఖాతాలు (తనకు తెలిసినవారి వద్ద అవసరం లేకపోయినా బ్యాంకు ఖాతాలు రూ.5 వేలకు ఆశపడి) తెరిపించి బుక్కయ్యాడు. అవే ఖాతాల్లో వారు రూ.లక్షల్లో బెట్టింగ్ లావాదేవీలు జరిపినట్లు తెలుసుకుని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అందుకే ప్రతీ ఖాతాదారుడు తన ప్రమేయం లేకుండా ఎవరికీ బ్యాంకు అకౌంట్లు, ఏటీఎం కార్డులు, పిన్‌నెంబర్లు, ఓటీపీ నెంబర్లు ఇవ్వవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. యువత కూడా ఎటువంటి బెట్టింగ్ యాప్‌ల జోలికి పోవొద్దని, అప్రమత్తంగా ఉండాలని హితవు పలుకుతున్నారు.


