అరసవల్లి: జాతీయ డెంగీ నివారణా దినోత్స వం సందర్భంగా శనివారం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం నుంచి అధికార సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక కార్యాలయం నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు వెళ్లి డెంగీ నివారణ అవగాహనకు నినాదాలు చేశారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ అనిత, జిల్లా మలేరియా అధికారి పి.వి.సత్యనారాయణ, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
సమన్వయంతో పనిచేయాలి
ఎచ్చెర్ల : ట్రిపుల్‌ఐటీ కళాశాల అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆర్జీయూకేటీ వీసీ మద్దాలి లక్ష్మీనారాయణ సూచించారు. శనివారం శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో పనిచేస్తున్న నాన్‌టీచింగ్ సిబ్బంది వీసీని మర్యాదపూర్వకరంగా కలిశారు. ఈ సందర్భంగా వీసీ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు తదితరులు పాల్గొన్నారు.
‘ఆ భూమి వారసత్వ ఆస్తి’
కంచిలి: కేసరపడ కాలనీకి ఆనుకొని సర్వే నంబర్:468/2, 468/3 లలో ఉన్న 19 సెంట్ల స్థలం తన భర్త సల్ల షణ్ముఖరావుకు వారసత్వంగా వచ్చిన ఆస్తి అని భార్య సల్ల సావిత్రి తెలిపారు. ఈ భూవివాదాన్ని పరిష్కరించాలంటూ కొందరు కాలనీవాసులు పాత్రికేయ సమావేశంలో శుక్రవారం కోరిన మేరకు భర్త ఉపాధి కోసం బయట రాష్ట్రంలో ఉండటంతో ఆయన తరఫున వివరణ ఇచ్చారు. తన భర్తకు ఉమ్మడి కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తి అని, తమ వద్ద ఉన్న పట్టాదారు పాస్ పుస్తకం తదితర ఆధారాల జెరాక్స్ కాపీలను విలేకర్లకు అందజేశారు. దీన్ని ప్రభుత్వ పోరంబోకు భూమిగా కొందరు స్థానికులు చిత్రీకరించడం సరికాదన్నారు. తమకు చెందిన స్థలంలో ఇప్పటికే ఓవర్‌హెడ్ ట్యాంకు, కాలనీ ఇళ్లు నిర్మించారని, ఇటీవల దౌర్జన్యంగా సిమెంటు రోడ్డు ప్రభుత్వ నిధులతో నిర్మించారని వాపోయారు. తమకు చెందిన జిరాయితీ భూమిలో ఎటువంటి పరిహారం ఇవ్వకుండా నిర్మాణాలు చేపట్టడం తగదన్నారు.
ఈశాన్య ప్రాంత ప్రత్యేక సెల్ ఏర్పాటు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈశాన్య ప్రాంత ప్రజల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వృత్తి, చదువు నిమిత్తం ఈశాన్య ప్రాంతాల నుంచి శ్రీకాకుళం జిల్లాకు వలస వచ్చిన ప్రజల కోసం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసిందన్నారు. వీరికి ఉచితంగా న్యాయ సేవలు అందిస్తామని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లను నియమిస్తామన్నారు.
కారు ఢీకొని వ్యక్తికి గాయాలు
హిరమండలం: ఎల్‌ఎన్‌పేట మండల కేంద్రం సమీపంలో కోవిలాం కాలనీ వద్ద అలికాం–బత్తిలి ప్రధాన రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రావిచంద్రి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు గాయపడ్డాడు. రావిచంద్రి నుంచి ఎల్‌ఎన్‌పేట మండలకేంద్రానికి బైక్‌పై వస్తుండగా హిరమండలం వైపు నుంచి ఆమదాలవలస వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడిన శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.
ప్రైవేటు టీచర్లకు అడ్మిషన్ తిప్పలు
హిరమండలం : ప్రైవేటు టీచర్లకు అడ్మిషన్ల ఆగచాట్లు తప్పడం లేదు. అసలే మండే ఎండలకు తోడు ఉక్కపోతతో అల్లాడుతుంటే అడ్మిషన్ల టార్గెట్ వారిని మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు టార్గెట్ పెట్టి వీధుల్లో పరుగెత్తిస్తుంటే ..మరికొన్ని పాఠశాలల యాజమాన్యాలు బస్సుల్లో టీచర్లను పల్లెలకు తీసుకువెళ్లి కరపత్రాల ద్వారా ప్రచారం చేయడంతో పాటు అడ్మిషన్లు చేయించేలా ఒత్తిళ్లు పెడుతున్నారు. లేకపోతే ఈ ఏడాది జూన్‌లో ప్రారంభమయ్యే కొత్త విద్యాసంవత్సరానికి సంబంధించి ఉపాధ్యాయ పోస్టుకు రెన్యువల్ ఉండదని భయపెడుతున్నారు. సాధారణంగా వేసవి సెలవుల్లో విహారయాత్రలకు కుటుంబసభ్యులతో వెళ్లాల్సిన సమయంలో పల్లెలు, పట్టణాల్లో తిరగాల్సి వస్తోందని ప్రైవేటు టీచర్లు వాపోతున్నారు. జిల్లాలో దాదాపు 600 మందికి పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు ఉపాధ్యాయులపై టార్గెట్ విధిస్తున్నారు. ఒక్కో ఉపాధ్యాయుడికి 10 అడ్మిషన్లు చేయించాలని తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. అలాంటి ఉపాధ్యాయులను అడ్మిషన్ల కోసం ఇబ్బందులు పెట్టడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రైవేటు పాఠశాలల మధ్య పోటీతత్వం పెరగడంతో విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు ఎవరికి వారు తాపత్రయపడుతున్నారు.


