పోలీసుల పట్ల కనికరమేదీ ? | - | Sakshi
Sakshi News home page

పోలీసుల పట్ల కనికరమేదీ ?

May 17 2026 12:42 AM | Updated on May 17 2026 12:42 AM

ముఖ్యమంత్రి పర్యటనలో భారీ బందోబస్తు

దాదాపు 10 గంటలు ఎండలో నిల్చునే విధులు

శ్రీకాకుళం క్రైమ్‌ : నెలలో కనీసంగా 5 నుంచి 10 వరకు బందోబస్తు విధులు.. జిల్లాలోనే కాదు జిల్లాను దాటి కూడా వెళ్లాల్సిందే. అందులో కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రతి చిన్న విషయానికీ భారీ సమావేశాలు, ముఖ్య నేతల పర్యటనలు, అధికారులతో రివ్యూలు, దేవాలయాల్లో ఉత్సవాలు, రాష్ట్ర పండగల పేరిట పోలీసుల బందోబస్తు.. ఏమాత్రం నిర్వహణలో తేడాలొచ్చినా, శాంతిభద్రతల్లో విఘాతమేర్పడినా అప్పటివరకు అంతా తామే అన్న రీతిలో వ్యవహరించే నేతలంతా తప్పుకొని పోలీసుల మీదే తప్పులను నెట్టేస్తారు. గత కొంతకాలంగా ఇదే తంతు జిల్లాలో నడుస్తోంది. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలోని నరసన్నపేటలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర పేరుతో పర్యటనకొచ్చారు. దీనిలో భాగంగా హోంగార్డు నుంచి ఎస్పీ వరకు దాదాపు 1500 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో రెండురోజులు ముందుగానే విధుల్లో అంతా చేరారు. శనివారం ఉదయం 7 నుంచి చంద్రబాబు తిరుగుపయనమైన సాయంత్రం 5 గంటల వరకు ఎండలో నిల్చునే విధుల్లో పాల్గొన్నారు.

పొదుపు ఒట్టిమాటే..!

ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇంధనాన్ని పొదుపుగా వాడండి.. వాహనాలను కుదించుకోండి.. సమావేశాల్లో బందోబస్తు తగినంత మాత్రమే పెట్టుకోండన్న మాటలు చంద్రబాబు పర్యటనకు వర్తించవా అన్నది స్థానికులు చర్చించుకుంటున్నారు. కొందరు పోలీసులైతే ఇవేం బందోబస్తులండీ.. వెళ్తే అన్ని ఖర్చులూమావే.. ఇలాంటి వాటికి టీఏలు ఏమీ ఇవ్వరు.. గడిచిన మూడు బందోబస్తుల్లో ఇదే పరిస్థితి అని వాపోయారు. వాస్తవానికి పీసీ, హెచ్‌సీ, ఏఎస్‌ఐల వరకు నెలకు రూ.2,200లు టీఏ ఇవ్వాలి, ఎస్‌ఐ, సీఐలకు రూ. 3,500లు, డీఎస్పీ ఆపై స్థాయి అధికారులకు రూ. 5 వేలు ఇవ్వాలి. గడిచిన 6 నెలలుగా ఇవి రావడం లేదని, నాయకుల సమావేశాలకు తాము పడుతున్న పాట్లు ఎవరూ పట్టించుకోవడంలేదంటూ పోలీసులు చర్చించుకోవడం గమనార్హం. ఇక పోలీసు వాహనాల్లో డీజిల్‌ ఖర్చు కూడా ఇలాంటి సమావేశాలకు, బందోబస్తులకు ఎంతవుతుందో ప్రభుత్వ పెద్దలే గ్రహించాలని వాపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement