శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ ఐసెట్–2026 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. శనివారం వెలువడిన ఫలితాల్లో పలువురు విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంజినీరింగ్, డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులకు నిర్వహించిన ఐసెట్ ఫలితాల్లో రికార్డు స్థాయిలో 96 శాతం మంది ప్రవేశాలకు అర్హత సాధించారు. జిల్లాలో మే 2న ఐసెట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. జిల్లా నుంచి 683 మంది ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోగా పరీక్షకు 590 మంది హాజరయ్యారు. వీరిలో 566 మంది ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు.
మెరుగైన ర్యాంకులు..
డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న మురపాక లిఖిత 133వ ర్యాంకు, జె.లోలాక్షి 199వ ర్యాంకు, పంచిరెడ్డి హారిక 243, కె.జయవర్ధన్ 259వ ర్యాంకు, ఎం.సోమినాయుడు 425వ ర్యాంకు, ఎ.కోమలి 543వ ర్యాంకు, ఏఎస్‌వీ నిహాల్‌వర్షిత్ 712వ ర్యాంకు, కుమారి యజ్ఞప్రియ 955వ ర్యాంకుతో రాణించారు. వీరంతా శ్రీకాకుళంలోని కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్ధులు కావడం విశేషం.
సర్కారు వైఫల్యం..
ఉన్నత చదువులకు దూరం!
కాగా, కూటమి ప్రభుత్వం వైఫల్యం కారణంగా ఉన్నత చదువులకు విద్యార్థులు దూరమైపోతున్నారు. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సకాలంలో చెల్లించకపోతుండటంతో భారీ మొత్తంలో ఫీజులు చెల్లించుకుని చదువుకొనే అవకాశం లేని విద్యార్థులు ఉన్నత చదువులకు స్వస్తి పలుకుతున్నారు. గతంలో వేల సంఖ్యలో పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం వందలకు పడిపోయిందంటే కూటమి ప్రభుత్వ పాలన.. విద్యకు వారు ఇస్తున్న ప్రాధాన్యం ఏంటో అర్ధమౌతోంది.
మెరుగైన ర్యాంకులు సాధించిన జిల్లా విద్యార్థులు
రికార్డు స్థాయిలో 96 శాతం మంది అర్హత


