● ఖర్చులు తగ్గించుకోవాలని ప్రధాని పిలుపు
● సీఎం చంద్రబాబు పర్యటనకు ఇష్టానుసారం ప్రజాధనం ఖర్చు
● రోడ్డు కోసం చెరువును కప్పేసిన వైనం
● పారిశుద్ధ్యం కోసమే రూ.కోటికిపైగా ఖర్చు
● డంపింగ్ యార్డ్ ముస్తాబుకు అక్షరాలా రూ.అరకోటి పైనే
చెరువునే కప్పేశారు
భూగర్భ జలాలు పెంపొందించేందుకు చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఒక వైపు ప్రచారం చేస్తున్నారు. కానీ సీఎం వస్తున్నాని నరసన్నపేట పట్టణంలోని శర్మాల (పాలకర్ర) చెరువును సగానికి పైగా కప్పేశారు. ప్రజావేదిక సభా ప్రాంగణానికి వెళ్లేందుకు రోడ్డు మార్గం కోసం చెరువును కప్పడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.
నరసన్నపేట: ఆర్భాటాలు వద్దని, ఖర్చులు తగ్గించుకోవాలని ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చా రు. మన నాయకులు కూడా కాన్వాస్‌లు తగ్గించుకుని ఇదిగో మేమూ చేస్తున్నామంటూ బడాయిలకు పోయారు. తీరా చూస్తే.. నరసన్నపేటలో సీఎం పర్యటనకు ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు పెడుతూ దొరికిపోయారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని కలెక్టర్ జిల్లా అధికారులకు, జిల్లాలో ఉన్న ఎంపీడీఓలకు తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగించారు. వీరంతా పది రోజులు గా నరసన్నపేటలోనూ తిరుగుతూ వందలాది లీట ర్ల డీజిల్‌ను ఖర్చు చేశారు. పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుకు 20 వార్డుల్లో రోజుకు ఒక్కో వార్డులో 10 మంది చొప్పున పారిశుద్ధ్య కార్మికులను, ఒక్కో వీధికి ఒక జేసీబీ, మరో ట్రాక్టర్ వినియోగించారు. దీని కోసం రూ. 20 లక్షలు వెచ్చించారని సమాచారం. ఇలా పదిరోజులు చేశారు. ఈ చర్యలకే కోటికి పైగా ఖర్చయినట్లు తెలుస్తోంది. పట్టణంలో అంతా ౖపైపె మెరుగులు చేశారు. ప్రస్తుతం మెయిన్ రోడ్డుపైనే అందరి దృష్టి పెట్టి పరిసర వీధుల్లో పట్టించుకోకపోవడంతో సమీప వీధుల్లో అప్పుడే చెత్త పెరుగుతోంది.
డంపింగ్ యార్డు ముస్తాబుకే..
చెత్త నుంచి సంపద కేంద్రం నరసన్నపేటలో 2018 జూన్ 6న ప్రారంభించారు. అప్పట్లో దీని నిర్మాణానికి రోడ్లు, లోపల పరికరాలకు రూ. 50 లక్షల వరకూ వెచ్చించారు. ఈ ఎనిమిదేళ్లలో దీని నుంచి పైసా రాబడి రాలేదు. దీన్ని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి వస్తుండటంతో అధికారులు మరో రూ. 60 లక్షలకు పైగా వెచ్చించినట్లు తెలుస్తోంది. అంతా సినిమా సెట్టింగులు చేసినట్లు సమాచారం.
సమావేశానికి..
తామరాపల్లి హెలీప్యాడ్ వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడే కార్యకర్తలతో ముఖాముఖి ఏర్పా టు చేశారు. 1100 మంది కార్యకర్తలు పట్టేలా భారీ సెట్టింగులు చేశారు. సెంట్రలైజ్డ్ ఏసీలు అమర్చారు. ఈ సమావేశానికీ సినిమా సెట్టింగులు చేస్తున్నారు. ఏసీ నిలిచేందుకు ఫ్లోర్ పై ప్రత్యేక కర్ర ప్లేట్లు వేస్తున్నారు. దారి పొడవునా సినిమా సెట్టింగులు వేస్తున్నారు.


