● జిల్లాలో కట్టుతప్పిన శాంతిభద్రతలు
● విపరీతంగా గంజాయి రవాణా
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో పట్టపగలే హత్యలు జరుగుతున్నాయి. గన్ నెత్తిన పెట్టి, కత్తులు పీక మీద పెట్టి దోపిడీలు జరుగుతున్నాయి. అంతర్రాష్ట్ర ముఠాలు చొరబడుతున్నాయి. ఇది చాలదన్నట్టు కొంతమంది అధికార పార్టీ నేతలు తమ అనుచర గణంతో దాడులకు పాల్పడుతున్నారు. జిల్లాపై నెత్తుటి మరకలు పడుతున్నా పట్టించుకునే వారు లేకపోవడంతో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. ఒక వ్యక్తి ఏకంగా జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు కూడా. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో జిల్లాచూసిన ప్రగతి ఇదే. పెట్రోల్, గ్యాస్ బండలు, నీటి కుండలు కష్టమనుకుంటున్న ఈ కాలంలో వీధివీధినా బెల్టుషాపులు దర్శనమిస్తున్నాయి. సిండికేట్ మా టున ప్రజాప్రతినిధులే అంతా తామై దోచుకోవడం ప్రజలు గమనిస్తున్నారు. మద్యం మత్తులో దాడుల ఘ టనల కేసులైతే కొదవే లేదు. ఏకంగా పోలీసులమీదే తిరగబడిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం నరసన్నపేటకు వస్తుండడంతో ఆయనైనా శాంతిభద్రతలపై ఆరా తీస్తారేమోనని స్థానికులు ఎదురు చూస్తున్నారు.
ఆ గంజాయి అంతా ఎక్కడిది..?
జిల్లాలో గంజాయి లేనే లేదని అధికారులు చెబుతున్నారు. కానీ నిత్యం ఏదో ఒక చోట రవాణా చేస్తూ.. కొందరు దొరుకుతున్నారు. స్థానిక యువతకు ఈ గంజాయి సరఫరా అవుతోందనే ఆరోపణ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ‘డయల్ యువర్ ఎస్పీ’ కాల్స్ సైతం గంజాయి మాటున దాడులను తేటతెల్లం చేస్తున్నాయి.
ఘటనలు ఇవిగో..
● నరసన్నపేట నియోజకవర్గం శ్రీముఖలింగంలో ఎమ్మెల్యే బగ్గు అనుచరులు ఓ అర్చకునిపై దాడికి యత్నించగా పోలీసులు న్యాయం చేయకపోవడంతో జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.
● రాష్ట్ర మంత్రి అచ్చెన్న ఇలాకాలో తమ వర్గానికి ఎదురు తిరిగి సర్పంచిగా పోటీ చేశాడనే అక్కసుతో ఓ ఆడియోకాల్ అంశంలో కింజరాపు అప్పన్న అనే వ్యక్తిని పోలీసులు రహస్యంగా రెండు రోజులు తీసుకెళ్లారని ఏకంగా అతని భార్యే ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
● నౌపడలో సర్పంచ్ జీరు బాబూరావు సోదరుడు జీరు విశ్వనాధాన్ని ఓ కేసు విషయంలో స్టేషన్‌కు రాలేదన్న కోపంతో విశ్వనాథం పనిచేస్తున్న రొయ్యల చెరువు వద్దకు వెళ్లిన ఎస్‌ఐ దాడి చేశారు.
● జిల్లా కేంద్రంలో ఆధ్యాత్మిక కేంద్రమైన అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో ఈ ఏడాది జరిగిన రథసప్తమి వేడుకల్లో నకిలీ వీవీఐపీ పాసుల కుంభకోణం ఆలయ ప్రతిష్టను మసకబార్చింది.
● లావేరు మండలం మురపాకలో ఓ వృద్ధురాలిని ఈడ్చుకెళ్లి చెవి, ముక్కు కోసేసి బంగారం తెంపేసి ఆపై కాల్చి బావిలో పడేశారు. ఇప్పటికీ నిందితుల జాడ తెలియదు. ఇదే ఘటన మాదిరి నరసన్నపేటలోని ఓ వృద్ధురాలు హతమైంది.
● ఎచ్చెర్ల ఫరీద్‌పేటలో రెండు రాజకీయ హత్యలు జరగ్గా, నరసన్నపేట వనవిష్ణుపురంలో మరో హత్య జరిగింది.
● కాశీబుగ్గ వెంకటేశ్వర జ్యూయలర్స్ దోపిడీలో పాల్గొన్న ఒడిశా డెకాయిట్లను పోలీసులు పట్టుకున్నారు గానీ కీలక ఉత్తరప్రదేశ్ డెకాయిట్లను పట్టుకురాలేదన్న విమర్శలున్నాయి.
● జిల్లాలోని పైడి భీమవరం నుంచి టెక్కలి హైవే వెంబడి నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
● ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో డెన్‌లకు మన జిల్లాకు చెందిన వారు వెళ్లి ఇరుక్కుంటున్నారు.


