కూటమి నేతలు.. ఇవేం కోతలు! | - | Sakshi
Sakshi News home page

కూటమి నేతలు.. ఇవేం కోతలు!

May 16 2026 5:05 AM | Updated on May 16 2026 5:05 AM

కూటమి నేతలు.. ఇవేం కోతలు! పొదుపు పాటించాలి...

అరసవల్లి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్‌ చార్జీలు పెంచం..తగ్గిస్తాం...అసలు విద్యుత్‌ కోతలుండవ్‌..అంటూ ప్రకటనలు గుప్పించిన నాయకుల మాటలకు నేటి వాస్తవ పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకుండాపోయింది. వేసవి కాలంలో గతంలో ఎన్నడూలేనంత విద్యుత్‌ కష్టాలు మొదలయ్యాయి. వేసవి ముందస్తు చర్యలపై కూటమి సర్కార్‌ నిర్లక్ష్యం ఫలితంగా ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ (ఈఎల్‌ఆర్‌) పేరిట విద్యుత్‌ కోతలు మొదలుపెట్టేశారు. దీంతో పరిశ్రమలతో పాటు గ్రామీణ ప్రాంతాల విద్యుత్‌ వినియోగదారులకు విద్యుత్‌ కష్టాలు మొదలయ్యాయి. అవసరమైనంత విద్యుత్‌ వినియోగ సప్లయ్‌ తగ్గిపోయి..వినియోగం కూడా భారీగా పెరిగిపోవడంతో అవస్థలు తప్పడం లేదు. జిల్లాలో ఉన్న లక్షలాది మంది గ్రామీణ విద్యుత్‌ వినియోగదారులకు గత నెల నుంచి విద్యుత్‌ కోతల కష్టాలను కూటమి సర్కార్‌ రుచి చూపిస్తోంది.

ఒకేరోజు 75 లక్షల యూనిట్లు వినియోగం..!

జిల్లాలో శ్రీకాకుళం, పలాస, టెక్కలి డివిజన్ల పరిధిలో ఎల్‌టీ విద్యుత్‌ వినియోగదారులు (గృహాలు) 8,07,794, హెచ్‌టీ విద్యుత్‌ వినియోగదారులు 504 విద్యుత్‌ కనెక్షన్లున్నాయి. సప్లయ్‌కు మించి వినియోగం పెరగడంతో ఈఎల్‌ఆర్‌ కష్టాలు మొదలయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో గతంలో కంటే రికార్డు స్థాయిలో విద్యుత్‌ వినియోగం మిలియన్‌ యూనిట్లు (ఎంయూ) పెరిగింది.

● మే 9న 71.65 లక్షల యూనిట్లు (7.16 మిలియన్‌ యూనిట్లు), 10వ తేదిన 7.16 ఎం.యు, 11వ తేదీన 7.31 మిలియన్‌ యూనిట్లు, 12న 7.41 ఎం.యు, 13న కాస్తా వాతావరణం చల్లబడటంతో 7.1 ఎం.యు, 14న ఏకంగా 75 లక్షల యూనిట్లు (7.51 ఎం.యు) విద్యుత్‌ వినియోగం నమోదయ్యింది. ఈ వేసవి సీజన్‌లో 14న అత్యధిక నమోదు జరిగినట్లుగా విద్యుత్‌ శాఖ అధికారులు ప్రకటించారు. ఇదిలావుంటే ఈ ఏడాది ఏప్రిల్‌లో 16, 22, 23 తేదీల్లో ఈఎల్‌ఆర్‌ పేరిట విద్యుత్‌ కోతలు విధించిన విద్యుత్‌ శాఖ, తాజాగా ఈ నెల 11వ తేదిన కూడా సప్లయి కంటే విద్యుత్‌ వినియోగం పెరిగిపోవడంతో ఈఎల్‌ఆర్‌ కోతలు తప్పలేదు..

అత్యధికంగా ఏసీల వినియోగం..!

విద్యుత్‌ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా వినియోగదారులకు అవగాహన కల్పించేలా విద్యుత్‌ శాఖ పలు కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వినియోగంలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. ప్రస్తుత విద్యుత్‌ వినియోగం అత్యధిక స్థాయికి పెరిగిపోవడంలో ఏసీల వినియోగమే కీలకమని చెప్పవచ్చు. జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో ప్రతి పదిళ్లకు ఒక్కో ఏసీ ఉందనే లెక్కలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కనీసంగా వీధికి 5 నుంచి 10 ఏసీలున్నాయి. వ్యాపార దుకాణ సముదాయాలు, మాల్స్‌లో కనీసం 10 నుంచి 50 ఏసీలు వరకు వినియోగంలో ఉన్నాయి. పీక్‌ అవర్స్‌లో విద్యుత్‌ వినియోగం పెరిగిపోవడంతో ఈఎల్‌ఆర్‌ పేరిట విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు.

వేసవిలో విద్యుత్‌ పొదుపు తప్పకుండా పాటించాలి. విద్యుత్‌ ఇంప్రూవ్‌మెంట్‌లో భాగంగా ముందస్తుగా జిల్లా సర్కిల్‌లో 266 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశాం. 368 కిలోమీటర్ల మేర కండక్టర్లు కొత్తగా మార్చాం. 8 మీటర్లు పొడవున 2526 విద్యుత్‌ స్తంభాలు, 9.1 మీటర్ల పోల్స్‌ 2618 వరకు మార్చాం. సప్లయి కంటే వినియోగం పెరిగినప్పుడు ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ క్రింద పారిశ్రామిక వినియోగంపై చర్యలు చేపడుతున్నాం.

– నాగిరెడ్డి కృష్ణమూర్తి, ఎస్‌ఈ, విద్యుత్‌ సర్కిల్‌

తాము అధికారంలోకి వస్తే విద్యుత్‌ కోతలే ఉండవని నాడు ప్రగల్భాలు

ఇప్పుడు ఈఎల్‌ఆర్‌ పేరిట ఇష్టారాజ్యంగా సరఫరా నిలిపివేత

మండిపడుతున్న వినియోగదారులు

14న రికార్డు స్థాయిలో విద్యుత్‌ వినియోగం నమోదు

Advertisement
 
Advertisement
Advertisement