ఫైబర్‌ నెట్‌ సేవలకు అంతరాయం | - | Sakshi
Sakshi News home page

ఫైబర్‌ నెట్‌ సేవలకు అంతరాయం

May 16 2026 5:05 AM | Updated on May 16 2026 5:05 AM

72 గంటలుగా నిలిచిన సేవలు

జిల్లా వ్యాప్తంగా 30 వేల మంది వినియోగదారులకు ప్రసారాలు బంద్‌

రణస్థలం: ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఏపీ ఫైబర్‌నెట్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌) సేవలు నిలిచిపోయాయి. 72 గంటలుగా టీవీలు మూగబోయాయి. ఆరుమాసాలగా ప్రతిరోజు అక్కడక్కడా సమస్యలు ఉత్ఫన్నంగా కాగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీంతో వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలతో కలిసి ఇంట్లో ఆనందంగా గడుపుదామని వినియోగదారులు ఫైబర్‌ నెట్‌కు నెలవారీ ప్యాకేజీలు రూ.350, రూ.450, రూ.600 చొప్పున కట్టారు. ప్రస్తుతం నెట్‌ పని చేస్తున్నా టీవీ చానల్స్‌కు పూర్తి అంతరాయం ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 30వేలకు మంది వినియోదారులు ఆందోళన చెందుతున్నారు.

చేతులెత్తేసిన ఆపరేటర్లు

వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆపరేటర్ల నుంచి సరైన సమాధానం లేకుండాపోయింది. ఒకటికి పది సార్లు ఫోన్లు చేసినా, ఆఫీస్‌కు వచ్చి నేరుగా ఫిర్యాదు చేసిన ఏం చెప్పాలో పాలుపోని పరిస్థితిలో ఆపరేటర్లు ఉన్నారు.

వెండర్‌ సమస్య..

క్షేత్రస్థాయిలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యను గుర్తిస్తున్నామని ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ నుంచి కష్టమర్లకు సమాచారం వచ్చింది. ఈ సమస్య అంతా వెండర్‌ సృష్టిస్తున్న సాంకేతిక పరమైన సమస్యల వల్ల కలిగిందని వివరణ ఇచ్చారు. నిత్యావరసర సేవలను అత్యంత వేగంగా పునరుద్ధరించడానికి షోకాజ్‌ నోటీసులు, ఉన్నత స్థాయి చర్చలతో సహా అన్ని చట్టపరమైన, పరిపాలనాపరమైన చర్యలను చేపడుతున్నామని పేర్కొన్నారు.

పట్టించుకోని ప్రభుత్వం..

ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఏపీ ఫైబర్‌ నెట్‌ సేవలపై తరుచూ ఫిర్యాదులు అందుతున్నా కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement