పలాస: పలాస మండలం సుమ్మాదేవి రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం రైలు నుంచి గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. సుమారు 40 ఏళ్ల వయస్సు గల వ్యక్తి గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు గమనించి 108కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వారు హుటాహుటిని వచ్చి పలాస ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. జి.ఆర్.పి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థులకు ప్రపంచ స్థాయి సాంకేతిక విద్య
ఎచ్చెర్ల : గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రపంచస్థాయి నాణ్యమైన సాంకేతిక విద్యను, ఆధునిక పరిజ్ఞాణాన్ని అందించడమే లక్ష్యమని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం నూతన ఉప కులపతి మద్దాలి లక్ష్మీనారాయణరావు స్పష్టం చేశారు. వీసీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి శుక్రవారం శ్రీకాకుళం జిల్లా క్యాంపస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ గిరిధర్, నూజివీడు డైరెక్టర్ గోపాలరాజు, పరిపాలనాధికారి ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం క్యాంపస్‌లోని వసతులు, విద్యా విధానాన్ని పరిశీలించిన వీసీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆర్జీయూకేటీని దేశంలోనే అత్యుత్తమ సాంకేతిక విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.పరిశోధనలకు, విద్యార్థుల సమగ్ర వికాసానికి పెద్దపీట వేస్తామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ సండ్ర అమరేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.


